సంతాన శ్రీనివాసుడు

సంతాన శ్రీనివాసుడు
తిరుమల క్షేత్రంలో అడుగుపెట్టిన వేంకటేశ్వరుడు ... అశేష భక్త జనుల మనసు మందిరాలలో కొలువుదీరాడు. ఆ భక్తులు స్వామివారికి ఆలయాలు నిర్మించి ఆయన పట్ల తమకి గల ప్రేమానురాగాలను ప్రదర్శించారు. మహర్షుల కోరిక మేరకు స్వామివారు స్వయంభువుగా ఆవిర్భవించిన క్షేత్రాలు కొన్నయితే, మహాభక్తులు నిర్మించినవి మరికొన్ని. ఈ నేపథ్యంలో నిర్మించబడిన వేంకటేశ్వరస్వామి ఆలయాల జాబితాలో 'అన్నపురెడ్డి పల్లి' కూడా కనిపిస్తుంది.

ఖమ్మం జిల్లాకి చెందిన ఈ క్షేత్రం ఎంతో చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకుని కనిపిస్తుంది. క్రీ.శ.12 వ శతాబ్దం ద్వితీయార్థంలో రేచర్ల వంశానికి చెందిన కాకతీయ సైన్యాధిపతి స్వామివారికి ఇక్కడ ఆలయాన్ని నిర్మించాడు. అంతే కాకుండా స్వామివారి నిత్య నైవేద్యాలకు ఎప్పటికీ లోటు రాకూడదనే ఉద్దేశంతో తగిన ఏర్పాట్లు చేశాడు. ఆయన నిర్మించిన ఈ ఆలయాన్ని కేంద్రంగా చేసుకుని, ఇక్కడ గ్రామం ఏర్పడటం వలన ఈ ఊరుకి ఆయన పేరు వచ్చిందని చరిత్ర చెబుతోంది.

అలా అప్పట్లో ఆయన భక్తి శ్రద్ధలకు నిదర్శనంగా నిలిచిన ఈ క్షేత్రం, కాలక్రమంలో శిధిలావస్థకు చేరుకుంది. అలాంటి పరిస్థితుల్లోనే స్వామివారు ఓ భక్తుడికి కలలో దర్శనమిచ్చి, తన ఆలయాన్ని పునరుద్ధరించమని ఆదేశించాడట. తన ఆలయాన్ని నిర్మించిన కారణంగా ఆయనకి పుత్ర సంతానం కలుగుతుందని చెప్పాడట. ఆ మరునాడు తన కలను గురించి గ్రామస్తుల దగ్గర ప్రస్తావించిన ఆ భక్తుడు, వారి సహాయ సహకారాలతో ఆలయాన్ని పునరుద్ధరించాడు.

సంతానలేమితో బాధపడుతోన్న ఆ భక్తుడికి ఆ లోటు కాస్తా తీరిపోయింది. అలా 18 వ శతాబ్దంలో పునరుద్ధరించబడిన ఆలయాన్నే నేడు భక్తులు దర్శించుకుంటున్నారు. ఇక్కడి స్వామిని అందరూ 'సంతాన శ్రీనివాసుడు' గానే కొలుస్తుంటారు. గర్భాలయంలో స్వామివారు నిలువెత్తు రూపంలో దర్శనమిస్తూ వుంటారు. అమ్మవార్లు మాత్రం స్వామివారి పాదాల చెంత చిన్న పరిమాణంలో కనిపిస్తూ వుంటారు.

శరన్నవ రాత్రుల సందర్భంగాను ... ధనుర్మాసం సందర్భంగాను ప్రత్యేక పూజలు ... విశేష ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక బ్రహ్మోత్సవ సమయంలో నిర్వహించే 'గరుడ ముద్ద' కు ఎంతో విశిష్టత వుంది. సంతానంలేని వాళ్లు ఈ గరుడ ముద్దను ప్రసాదంగా తీసుకుంటారు. ఈ ప్రసాదాన్ని స్వీకరించిన వారు మాతృత్వాన్ని పొందుతుంటారు ... ఆ కృతజ్ఞతతో స్వామివారికి కానుకలు ... మొక్కుబడులు చెల్లిస్తూ వుంటారు.

More Bhakti Articles