సంతానమిచ్చే గొడ్రాలి కొండ

సంతానమిచ్చే గొడ్రాలి కొండ
మాతృత్వమే స్త్రీ జన్మకి పరిపూర్ణతను ప్రసాదిస్తుందనే విశ్వాసం పూర్వకాలం నుంచి వుంది. 'అమ్మా' అని పిలిపించుకోవడం కన్నా అదృష్టం మరొకటి లేదని ప్రతి స్త్రీ భావిస్తూ వుంటుంది. ఈ నేపథ్యంలో సంతానం లేని స్త్రీలను 'గొడ్రాలు' అని ఆనాటి సమాజం వారిని తక్కువగా చూసేది. దాంతో సంతానం కోసం ప్రతి ఒక్కరూ ఎంతగానో ఆరాటపడిపోయేవారు. తమ కలను నిజం చేసుకోవడం కోసం కనిపించిన రాయికీ రప్పకు మొక్కుతుండేవారు.

ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం రాజంపల్లికి చెందిన 'రాజమ్మ' అనే స్త్రీ కూడా తనకి సంతానాన్ని ప్రసాదించమని ప్రతి రోజూ దేవుడిని ప్రార్ధిస్తూ వుండేది. ఈ ఊరికి చెందిన రాజమ్మ ఇంటింటికీ తిరిగి పాలు పోస్తూ వుండేది. ఈ దారిలోనే ఆమెకి ఒక చోట పుట్ట కనిపించడంతో, నాగదేవత అనుగ్రహముంటే సంతానం కలుగుతుందనే ఉద్దేశంతో ఆ పుట్టలో పాలు పోయసాగింది. అలా కొన్ని రోజుల పాటు పాలు పోస్తూ వెళ్లిన ఆమెకి ఆ పుట్ట పెరుగుతున్నట్టుగా అనిపించింది. అందుకు ఏదో మహిమే కారణమై ఉంటుందని గ్రహించి పాలు పోయడం కొనసాగించింది.

అలా ఆ పుట్ట పెరుగుతూ ఓ కొండలా మారిపోయింది. పాల వ్యాపారం పడిపోతూ ఉండటంతో, రాజమ్మను రహస్యంగా అనుసరించిన భర్త, ఆమె చేస్తున్నది చూసి కొట్టబోయాడు. పుట్టలో ఉంటూ ఆ పాలు తాగుతోన్న 'తిరుమలనాథస్వామి' ప్రత్యక్షమై ఆయన్ని వారించాడు. అంతే కాకుండా ఆ దంపతులకు సంతానాన్ని అనుగ్రహించాడు. గొడ్రాలు కారణంగా ఏర్పడిన కొండ గనుక దీనికి 'గొడ్రాలి కొండ' అనే పేరు వచ్చింది. ఇక్కడి తిరుమలనాథ స్వామికి పాలు పోయడం వలన ఆమెకి సంతానం కలిగింది గనుక, ఈ కొండపై స్వామిని దర్శించడం వలన సంతానం కలుగుతుందనే విశ్వాసం ఏర్పడింది.

గొడ్రాలు పేరుతో గల కొండ సంతానాన్ని ఇవ్వడం ఒక విశేషంగా అనిపిస్తే, ఈ కొండ నిజంగానే భారీ ఆకారంగల పుట్టగా కనిపిస్తూ వుండటం మరో విశేషం. ఈ స్వామిని సేవించిన వారికి సంతానం కలగడం ఇక్కడి స్థల పురాణానికి మరింత బలాన్ని చేకూరుస్తోంది. ఇదంతా కూడా ఇక్కడి తిరుమలనాథస్వామి మహిమగానే భక్తులు చెబుతూ వుంటారు.

More Bhakti Articles