సమస్యలు హరించే సాయి

సమస్యలు హరించే సాయి
భక్తులనే తన కుటుంబ సభ్యులుగా భావించి, వారి ఆనందంలోనే తన సంతోషాన్ని వెతుక్కున్న సద్గురువు సాయి. తనకి ఎవరూ లేరనే విషయాన్ని ఆయన ఎప్పుడూ ఎక్కడా ప్రస్తావించలేదు. తన చుట్టూ వున్న వాళ్లంతా తన వాళ్లుగానే భావిస్తూ, చెదరని చిరునవ్వుతో సంతృప్తిని మించిన సంపదలేదనే విషయాన్ని చాటిచెబుతూ ఆయన తన జీవితాన్ని కొనసాగించాడు.

అలా అందరి మనసు మందిరాల్లో స్థానం సంపాదించుకున్న సాయి, ప్రతి గ్రామంలోను కొలువై అనుగ్రహిస్తున్నాడు. ఈ నేపథ్యంలో నిర్మించబడినదే హైదరాబాద్ లోని ఖైరతాబాద్ - ఆనంద్ నగర్ 'సాయి ఆలయం'. గ్రామదేవతగా 'తోట మైసమ్మ', ఆది దంపతులుగా పరమశివుడు - కనకదుర్గ దర్శనమిచ్చే ఈ ఆలయ ప్రాంగణంలోనే సాయి ఆలయాన్ని నిర్మించారు.

సాయి ఆలయాన్ని నిర్మించాలనే ఒక భక్తుడి బలమైన సంకల్పానికి నిదర్శనంగా ఇక్కడ సాయి కొలువుదీరి కనిపిస్తూ వుంటాడు. అందంగా తీర్చిదిద్దబడిన వేదికపై సాయి ప్రతిమ దర్శనమిస్తుంది. ప్రశాంతతకు ప్రతినిధిగా కనిపించే సాయిని చూడగానే, మనసుకు స్వస్థత లభిస్తుంది ... ఆత్మానందం కలుగుతుంది. భక్తుల సమస్యలను సావధానంగా విని, తాను వుండగా ఆందోళన ఎందుకంటూ అవలీలగా వాటిని హరించే బాబా ఉన్నాడుగా అనే భరోసా కలుగుతుంది.

ప్రతి ఉదయం బాబాకి అభిషేకాలు ... అలంకారాలు ... హారతులు జరుగుతుంటాయి. గురువారాల్లో ఆలయానికి వచ్చే భక్తుల సంఖ్య అధికంగా వుంటుంది. శివుడు ... శివాంశ సంభూతుడిగా చెప్పబడుతోన్న బాబా ఒకే ప్రదేశంలో కొలువై ఉండటాన్ని ఇక్కడి భక్తులు విశేషంగా చెప్పుకుంటారు. ఇక్కడి స్వామిని దర్శించడం వలన అనారోగ్యాలు .. ఆటంకాలు తొలగిపోయి, జీవితంలో ఉన్నతమైన స్థానం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసాన్ని ప్రకటిస్తుంటారు.

More Bhakti Articles