మహిమగల మహాగణపతి

మహిమగల మహాగణపతి

మహిమగల మహాగణపతి
వివిధ ప్రదేశాలను దర్శిస్తున్నప్పుడు అక్కడి కొండకోనలు మనసుని ఎంతగానో ఆకట్టుకుంటూ వుంటాయి. కొండలు ... వాటిపై గల బండరాళ్లు వివిధ రూపాల్లో కనిపిస్తుంటాయి. సహజంగా కనిపించే అలాంటి ఆకృతులను చూసినప్పుడు ఆశ్చర్యంతో అలాగే నుంచుండిపోతుంటాం. అనిర్వచనీయమైన ఆ సంతోషాన్ని తోటివారితో పంచుకుంటూ వుంటాం.

అలాగే క్రీ.శ.15 వ శతాబ్దం తొలినాళ్లలో బెంగుళూరు ప్రాంతాన్ని పరిపాలిస్తోన్న రాజు, ఒకసారి వేటకి వెళ్లినప్పుడు ఆయనకి ఒక కొండ కనిపిస్తుంది. ఆ కొండపై గల ఒక భారీ శిల అచ్చు వినాయకుడి రూపాన్ని కలిగి వుండటం ఆయనకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన పక్కనే గల పరివారానికి ఆయన ఆ విషయం చెప్పాడు. నిజంగానే ఆ శిల అచ్చం గణపతిని పోలి ఉందనీ, శిల్పులతో అక్కడక్కడా మార్పులు చేయిస్తే సరిపోతుందని వాళ్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తారు.

దాంతో వెంటనే ఆయన అందుకు తగిన ఏర్పాట్లు చేస్తాడు. శిల్పుల పనితనం కారణంగా గణపతిగా పూర్తి రూపాన్ని సంతరించుకున్న ఆ శిలకు ఆలయాన్ని నిర్మించి అందులో ప్రతిష్ఠిస్తాడు. అలా ఇక్కడ కొలువైన వినాయకుడు 'మహాగణపతి' గా .. 'దొడ్డ గణపతి' గా ప్రసిద్ధి చెందాడు. ఆనాటి నుంచి కూడా ఇక్కడి స్వామి అనేక మహిమలను చూపుతూ వస్తున్నట్టుగా భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు.

భారీ గణనాథుడికి ప్రతి ఉదయం పంచామృతాలతో అభిషేకాలు జరుపుతుంటారు. నయనానందకరమైన ఈ దృశ్యాన్ని తిలకించేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. ఇక గణపతి నవరాత్రులలో స్వామివారి వైభవం చూసితీరవలసిందే. ఇక ఈ ఆలయానికి పక్కనే గల నందీశ్వరుడి విగ్రహాన్ని చూడటానికి రెండు కళ్ళూ సరిపోవు. అంతటి భారీగా .. అందంగా .. జీవం ఉట్టిపడుతూ ఇది కనిపిస్తూ వుంటుంది. భారీ ప్రతిమలతో భక్తి భావ పరిమళాలను వెదజల్లుతోన్న ఈ క్షేత్రాన్ని దర్శించిన వాళ్లు ధన్యులవుతారనే చెప్పాలి.

More Bhakti Articles