అభయము నిచ్చే అయ్యప్ప

అభయము నిచ్చే అయ్యప్ప
భగవంతుడు నిరాకారుడై అంతటా వ్యాపించి వున్నా, ఆయన పాదస్పర్శ కారణంగా మరింత పవిత్రమైన ప్రదేశాలను దర్శించడానికి ... తరించడానికి భక్తులు ఆరాటపడుతుంటారు. ఈ కారణంగానే భగవంతుడు నదులకు ఆవలి తీరంలో వున్నా ... కొండకోనల్లో వున్నా భక్తులు అలసట ఎరగక అక్కడికి చేరుకుంటూనే వుంటారు ... ఆపదల నుంచి తమని రక్షించమని వేడుకుంటూనే వుంటారు.

అలా భక్తులను తన దగ్గరికి రప్పించుకునే దైవంగా అయ్యప్పస్వామి కనిపిస్తుంటాడు. ఆ స్వామి అనుగ్రహం సంపాదించుకోవడం కోసం మాలధారణ చేసి ... మండలదీక్ష చేసి శబరిమల యాత్రకు వెళ్లి వస్తుంటారు. అలా ఆ స్వామి పట్ల అశేష భక్త జనకోటికి పెరిగిపోయిన భక్తి శ్రద్ధల కారణంగా, అనేక ప్రాంతాల్లో అయ్యప్పస్వామి ఆలయాలు నిర్మించబడ్డాయి. అలాంటి వాటిలో ఒకటిగా కడప జిల్లా ప్రొద్దుటూరు అయ్యప్ప స్వామి ఆలయం కనిపిస్తుంది.

కేరళ తరహా నిర్మాణ శైలిలో కనిపించే ఈ ఆలయంలో అడుగుపెడుతూ ఉండగానే, ప్రాంగణంలో మహా శివుడి భారీ శిల్పం దర్శనమిస్తుంది. అలాగే విష్ణుమూర్తి ... లక్ష్మీదేవి ... సుబ్రహ్మణ్యస్వామి విగ్రహాలు కూడా నయన మనోహరంగా కనిపిస్తుంటాయి. చక్కని నగిషీలతో కళాత్మకంగా తీర్చిదిద్దిన ఆలయంలో అయ్యప్ప స్వామి దర్శనమిస్తూ వుంటాడు. పద్ధెనిమిది మెట్లు ... ఆ తరువాత గల వేదికపై స్వామి స్వర్ణ వర్ణంలో అభయమునిస్తూ వుంటాడు.

కార్తీక మాసం మొదలు మకర సంక్రాంతి వరకూ అయ్యప్ప మాలధారణ చేసిన భక్తులతో ఆలయం సందడిగా కనిపిస్తూ వుంటుంది. ఈ సమయంలో ఇక్కడ విశేష సంఖ్యలో మహా పడి పూజలు జరుగుతుంటాయి. ఇక్కడి స్వామిని దర్శించిన వారికి ఆయన అభయమునిచ్చి కాపాడుతూ ఉంటాడని భక్తులు విశ్వసిస్తూ వుంటారు.

More Bhakti Articles