అన్నదమ్ముల స్తంభాలు

అన్నదమ్ముల స్తంభాలు
వివిధ పుణ్యక్షేత్రాలని దర్శించినప్పుడు ముందుగా అక్కడ శిల్ప సంపద ఆకట్టుకుంటుంది. పూర్వం శిల్ప శాస్త్రం తెలిసిన కళాకారులు ఎక్కువగా వుండటం వలన, మహారాజులు కళాపోషకులు కావడం వలన ప్రాచీన ఆలయాలన్నీ కూడా నాటి భక్తి భావాన్ని ... కళా వైభవాన్ని చాటిచెబుతున్నాయి. ఇక నాటి శిల్పులు తమ 'ఉలి' చేత చేయించిన చిత్ర విచిత్రమైన విన్యాసాలకు, ఈ ఆలయాలు సజీవ సాక్ష్యాలుగా వెలుగొందుతూ వున్నాయి.

ఈ నేపథ్యంలో ఏకరాతి శిలపై పురాణం దృశ్యాలు మలచిన వారు కొందరైతే, మంటపాలను రథాలుగా మార్చినవారు కొందరు. రాతి స్తంభాలతో సరిగమలు పలికించిన వారు కొందరైతే, నేలను తాకకుండా స్తంభాలను నిలబెట్టిన వారు మరికొందరు. ఇలా ఆనాటి శిల్పకళా వైభవానికి అద్దం పడుతోన్న నిర్మాణాలలో కొన్ని నేడు మహిమాన్వితమైనవిగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. అలాంటి వాటిలో ఒకటి ప్రకాశం జిల్లా 'మార్కాపురం'లో దర్శనమిస్తుంది.

శిల్పకళ పట్ల నాటి రాజులకు గల ఆసక్తి ఎంతటిదో ఇక్కడి చెన్నకేశవస్వామి ఆలయంలో గల నిర్మాణాలను చూస్తే తెలిసిపోతుంది. ఇక్కడి ఆలయంలో అద్భుతమైన శిల్పకళ ఉట్టిపడే రెండు స్తంభాలు ప్రత్యేకంగా కనిపిస్తూ వుంటాయి. వీటిని 'అన్నదమ్ముల స్తంభాలు' గా పిలుస్తూ వుంటారు. కళాత్మకత ఉట్టిపడే ఈ స్తంభాలు అన్నదమ్ములు 'శబ్ద భేది' విద్యను ఉపయోగించి చెక్కారట.

అన్నదమ్ములలో ఒకరికి ఒకరు కనిపించకుండా మధ్యలో తెర కట్టుకున్నారు. స్తంభంపై అన్న ఉలితో చెక్కుతూ వుంటే, ఆ ఉలి శబ్దాన్ని బట్టి తమ్ముడు తన స్తంభంపై శిల్పాలను మలిచాడు. అలా చెక్కబడిన ఈ రెండు స్తంభాలు ఒకదాన్ని ఒకటి అద్దంలో చూపుతున్నట్టుగా కనిపిస్తుంటాయి. అదే శబ్దభేది విద్యలోని గొప్పతనమని కొందరు అనుకుంటే, వాళ్ల ప్రతిభకు తోడు భగవంతుడి మహిమ కూడా తోడైందనీ, ఇది నిజంగా మహిమాన్వితమేనని మరికొందరు చెబుతుంటారు.

More Bhakti Articles