మహాశివుడి దర్శనం

మహాశివుడి దర్శనం
శివుడు లింగ రూపంలోనే ఎక్కువగా దర్శనమిస్తుంటాడు. ఆయన ప్రతిమలు పూజలందుకునే క్షేత్రాలు చాలా తక్కువనే చెప్పాలి. శివలింగంపై ధారాపాత్రలో నీళ్లు పడుతూవుంటే ఎలాంటి అనుభూతి కలుగుతుందో, ధ్యానంలో వున్న మహాశివుడి ప్రతిమను చూసినా అలాంటి అనుభూతే కలుగుతుంది. అలా ధ్యానంలో గల మహాశివుడి భారీ విగ్రహం మనకి మధ్యప్రదేశ్ లోని 'జబల్ పూర్' లో దర్శనమిస్తుంది.

ఈ ప్రాంతానికి చెందిన ఓ శివ భక్తుడు, స్వామివారి మూర్తిని ఆరుబయట అందరూ ఒక్కసారిగా దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈ విగ్రహాన్ని తయారు చేయించి ప్రతిష్ఠింపజేశాడు. సువిశాలమైన ప్రదేశంలో అందంగా తీర్చిదిద్దిన ఉద్యానవనంలో పరమశివుడు నయనానందకరంగా కనిపిస్తుంటాడు. ఉద్యానవనంలో అక్కడక్కడ కృష్ణుడు ... గణపతి .. మహర్షుల ప్రతిమలు ఏర్పాటుచేయబడి వుంటాయి.

దాదాపు 80 అడుగుల ఎత్తుగల శివుడు, ఉద్యానవనం మధ్యలో విశాలమైన వేదికపై అరమోడ్పు కనులతో ధ్యానంలో నిమగ్నమై దర్శనమిస్తుంటాడు. ఒక చేతిలో త్రిశూలం ... మరో చేతిలో జపమాల ధరించి, మరో రెండు చేతులను ధ్యానముద్రలో కలిపి వుంచుతాడు. ప్రశాంతమైన వదనంతో దర్శనమిచ్చే శివుడిని చూడగానే, మనసు ఒక్కసారిగా పులకించిపోతుంది. ఇక ఇక్కడి స్వామిని దర్శించిన వాళ్లు .. గుహలాంటి ప్రదేశంలో ఏర్పాటు చేయబడిన పన్నెండు జ్యోతిర్లింగాలను దర్శించుకుంటూ వుంటారు.

ద్వాదశ జ్యోతిర్లింగాలు గల ప్రదేశాల నుంచి సేకరించిన ఈ శివలింగాలను దర్శించడం వలన సకల శుభాలు కలుగుతాయని చెబుతుంటారు. ఆహ్లాదకరమైన ... ఆధ్యాత్మిక పరమైన వాతావరణం వుండటం వలన, ఇక్కడికి వచ్చిన వాళ్లు మానసిక ప్రశాంతతను పొందుతుంటారు. అన్ని రకాల అనారోగ్యాలకు మందు మానసిక ప్రశాంతతయే కనుక, ఇది ఆరోగ్యాన్ని అందించే క్షేత్రంగా చెప్పుకోవచ్చు.

More Bhakti Articles