మొగలి పువ్వుకు శివుడి వరం!

మొగలి పువ్వుకు శివుడి వరం!
మహాశివలింగం ఆద్యంతాలు కనుగొనలేని బ్రహ్మదేవుడు, తాను తెలుసుకున్నట్టుగా శివుడి దగ్గర మొగలిపువ్వుతో అబద్ధపు సాక్ష్యం చెప్పిస్తాడు. దాంతో ఆగ్రహించిన పరమశివుడు, దైవ సంబంధమైన పూజలకు పనికిరాకుండా పొమ్మని మొగలిపువ్వును శపిస్తాడు. ఇలా శివుడి శాపానికి మొగలిపువ్వు గురైన విషయం అందరికీ తెలిసిందే.

అయితే ఆ తరువాత మొగలిపువ్వు తన జీవితానికి సార్థకత ప్రసాదించమని శంకరుడిని కోరిందట. మొగలి పేరుతో తాను పూజలు అందుకున్నప్పుడు, ఆ కోరిక నెరవేరుతుందని శంకరుడు వరాన్ని ప్రసాదించాడని ఓ క్షేత్రంలో స్థల పురాణంగా వినిపిస్తోంది. ఆ క్షేత్రం పేరు 'మొగిలి' ... ఇక్కడ కొలువుదీరిన శివయ్య పేరు 'మొగిలేశ్వరుడు'. అత్యంత విశిష్టమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రం చిత్తూరు జిల్లాలో దర్శనమిస్తోంది.

తన పేరుతో పరమశివుడు వెలుగులోకి వచ్చే క్షణం కోసం మొగలి పువ్వు ఎదురుచూడసాగింది. ఈ నిరీక్షణలో సుదీర్ఘ కాలం గడిచిపోయింది. అప్పటి వరకూ శివలింగాన్ని కనిపెట్టుకునే మొగలి పొదలు వున్నాయి. తమ పశువులు మేపుకోవడానికి ఈ ప్రాంతానికి వచ్చిన యువ దంపతులు ఇక్కడి మొగలి రేకులను కోయబోయారు. ఆ సమయంలోనే వారికి ఇక్కడ శివలింగం కనిపించింది.

ఆ శివలింగాన్ని వెలుగులోకి తీసుకురావలసిందిగా వారికి మాటలు వినిపించాయి. దాంతో ఆ దంపతులు ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలియజేశారు. కొందరి ఆర్ధికసాయం ... మరికొందరి శారీరక కష్టం కారణంగా స్వామికి ఆలయం నిర్మించబడింది. మొగలి పొదల్లో లభించిన కారణంగా శివయ్యని మొగిలేశ్వరస్వామిగా పూజించారు. అలా మొగలిపువ్వుకు శివుడు ఇచ్చిన వరం దక్కింది.

ఇక మొగలి పొదల్లోని శివుడిని వెలుగులోకి తెచ్చిన కారణంగా ఆ దంపతులను మొగిలప్ప ... మొగిలమ్మగా అందరూ పిలవసాగారు. కాలక్రమంలో ఈ ఆలయం అభివృద్ధి చెందుతూ వచ్చింది. ఎంతోమంది రాజుల పరిపాలనా కాలంలో ఈ క్షేత్రం వైభవంతో వెలుగొందినట్టు ఆనాటి శాసనాలు చెబుతున్నాయి. ఇక్కడి 'త్రిశూల' తీర్థం మహిమాన్వితమైనదనీ, సాక్షాత్తు పరమ శివుడే తన త్రిశూలంతో దీనిని సృష్టించాడని స్థల పురాణం చెబుతోంది.

ఇక్కడి ప్రాకార మంటపాల్లో పరివార దేవతలు కొలువై కనిపిస్తుంటారు. ఇక ఆలయ పైభాగంలోను ... లోపలి ప్రాకారంలోను, మొగిలప్ప ... మొగిలమ్మ దంపతుల విగ్రహాలు కూడా దర్శనమిస్తుంటాయి. మహా శివరాత్రి ... కార్తీకమాసం పర్వదినాల్లోనే కాకుండా విశేషమైన పుణ్యతిథుల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఇక్కడి స్వామిని దర్శించడం వలన సంపద .. సంతానం .. సౌభాగ్యం లభిస్తుందని భక్తులు చెబుతుంటారు.

More Bhakti Articles