జోగుళాంబాదేవి కటాక్షం

జోగుళాంబాదేవి కటాక్షం
మహబూబ్ నగర్ జిల్లా అలంపూర్ కి చెందిన 'జోగుళాంబా దేవి' గురించి తెలియని వారుండరు. మహాశక్తి స్వరూపిణి అయిన ఇక్కడి అమ్మవారు ... ఈ క్షేత్రం వివిధ కాలాల్లో వివిధ రకాల పేర్లతో పిలవబడ్డారు. అత్యంత ప్రాచీనమైనదిగా ... విశిష్టమైనదిగా చెప్పబడుతోన్న ఈ క్షేత్రంలో 'నవబ్రహ్మలయాలు' దర్శనమిస్తుంటాయి.

అయితే ప్రధాన దేవత అయిన జోగుళాంబా దేవికి ఓ ప్రత్యేకమైన ఆలయమంటూ లేకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించేది. అప్పట్లో బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయానికి చెందిన ఓ గదిలో అమ్మవారు దర్శనమిస్తూ వుండేది. ఈ విషయాన్ని గురించి కొందరు పండితులు ప్రాచీన గ్రంధాలను పరిశోధించగా, ఒకప్పుడు అమ్మవారి ఆలయం ఏ దిశలో ఎక్కడ ఉన్నదనే వివరాలు లభించాయి.

అక్కడ జరిపిన తవ్వకాల్లో పురాతన ఆలయం ఒకటి బయటపడింది. పూర్వం అమ్మవారి మూర్తి ఈ ఆలయంలోనే ఉండేదనీ, తప్పనిసరి పరిస్థితుల్లో బాలబ్రహ్మేశ్వర ఆలయంలోకి మార్చి ఉంటారని పండితులు భావించారు . అసలే అమ్మవారు ... ఆపైన ఆవేశమే అలంకారంగా కలిగిన అమ్మవారు ఆమెకి ఆశ్రయం లేకపోవడమే జరుగుతున్న అనర్థాలకు కారణమని వాళ్లు గ్రహించారు. అమ్మవారికి ఆలయాన్ని నిర్మించి అందులో ఆమెను ప్రతిష్ఠించాలని నిర్ణయించుకున్నారు.

పూర్వం అమ్మవారు ఉన్నట్టుగా చెప్పబడుతోన్న పాత ఆలయం స్థానంలోనే కొత్త ఆలయాన్ని నిర్మించారు. గతంలో ఇక్కడి ఆలయాలను నిర్మించిన బాదామీ చాళుక్యుల నిర్మాణ శైలిలోనే ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషంగా చెప్పుకోవాలి. ఇప్పుడు భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నది ఈ ఆలయంలోనే. అమ్మవారికి సంతోషాన్ని ... సంతృప్తిని కలిగించిన కారణంగా ఆ తల్లి కరుణా కటాక్షాలు సంపూర్ణంగా లభిస్తున్నాయంటూ భక్తులు చెబుతుంటారు.

More Bhakti Articles