విష్ణువు చెప్పిన ఆనవాలు

విష్ణువు చెప్పిన ఆనవాలు
దక్షిణ భారతదేశంలో మాండవ్య మహర్షిచే ముడిపడిన అనేక పుణ్యక్షేత్రాలు దర్శనమిస్తూ వుంటాయి. ఆ మహర్షి పాద స్పర్శ వలన ... ఆయన తపస్సు చేసిన కారణంగా ... యజ్ఞయాగాలు నిర్వహించినందువల్ల అనేక ప్రాంతాలు పవిత్రతను ... దివ్యత్వాన్ని సంతరించుకుని క్షేత్రాలుగా వెలుగొందుతున్నాయి. అలాంటి క్షేత్రాల్లో ఒకటిగా కరీంనగర్ కి చెందిన 'సిరిసిల్ల' కనిపిస్తుంది.

పూర్వం లోక కల్యాణం కోసం మాండవ్య మహర్షి యాగాన్ని తలపెట్టాడు. ఆ యాగానికి శ్రీమహావిష్ణువును ఆహ్వానించడం కోసం ఆయన గురించి తపస్సు చేశాడు. శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై ఆహ్వానం పట్ల అంగీకారం తెలపడంతో, యాగం పూర్తయిన తరువాత ఆ ప్రదేశంలో ఆవిర్భవించవలసిందిగా మాండవ్యుడు కోరాడు. ఆయనకి ఇచ్చిన మాటమేరకు స్వామివారు ఇక్కడ వెలిశాడు.

ఆ తరువాత కాలంలో తనకి ఆలయాన్ని నిర్మించవలసిందిగా శ్రీమంతులైన కొందరు భక్తులను స్వప్నం ద్వారా స్వామి ఆదేశించాడు. దాంతో వాళ్లు ఆలయాన్ని నిర్మించి స్వామివారి మూర్తికి ప్రాణప్రతిష్ఠ చేసి 'కేశవనాథుడు' గా కొలుచుకోసాగారు. కాలక్రమంలో జరిగిన మతపరమైన దాడుల కారణంగా ఇక్కడి స్వామి విగ్రహం భిన్నమైంది. గ్రామస్తులు మరో విగ్రహాన్ని ప్రతిష్ఠించాలనే ఆలోచన చేస్తూ వుండగా కొంతమంది భక్తులకు స్వామి స్వప్నంలో దర్శనమిచ్చాడు.

మాండవ్య మహర్షి ఆరాధించిన ప్రతిమ ఫలానా చోటున ఉందనీ, దానిని తీసి ప్రతిష్ఠించమని భక్తులను ఆదేశించాడు. స్వామి చెప్పిన ఆనవాళ్ల మేరకు వెతికిన భక్తులకు ఓ చెట్టుకింద 'లక్ష్మీ వేంకటేశ్వర స్వామి' వారి విగ్రహం లభించింది. ఇప్పుడు గర్భాలయంలో కనిపించే మూర్తి అదే. ఆలయ పునరుద్ధరణ ... లక్ష్మీ వేంకటేశ్వరుల ప్రతిష్ఠ జరిగిన తరువాత నిత్య పూజలు ... ప్రత్యేక సేవలు ... విశేష ఉత్సవాలు జరుగుతున్నాయి.

ప్రతియేటా విజయదశమి రోజున స్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమై, పది రోజులపాటు అంగరంగవైభవంగా జరుగుతాయి. ఈ సందర్భంగా స్వామివారికి జరిగే వివిధ వాహన సేవలను చూసి తీరవలసిందే. ఇక్కడి లక్ష్మీ వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నవారు, కష్టాల నుంచి బయటపడి సిరిసంపదలను పొందుతారని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles