15 సంపుటాల తెలంగాణ రాష్ట్ర చట్టాల పుస్తకాలను ఆవిష్కరించిన సీఎస్ సోమేశ్ కుమార్

Related image

హైదరాబాద్, మార్చి 9:  తెలంగాణ రాష్ట్రంలో అమలులో ఉన్న పలు చట్టాలు, రెగ్యులేషన్లతో కూడిన తెలంగాణ రాష్ట్ర చట్టాల15 సంకలనాల పుస్తకాలను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నేడు ఆవిష్కరించారు. ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర పునర్విభజన చట్టం 2014 ప్రకారం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం అనంతరం గతంలోని చట్టాలను సవరించడం, మార్పుల అనంతరం అమలులో ఉన్న చట్టాలు, నిబంధనలతో కూడిన 15 సంపుటాలను తెలంగాణ సచివాలయంలోని మొదటిసారిగా న్యాయ శాఖ వెలువరించింది. ఈ 15 సంపుటాలలో 1308 ఫసలీ నుండి 1925 వరకు ఉన్న చట్టాలు, రెగ్యులేషన్లు, 1956 జీహెచ్ఎంసీ ఆక్ట్ నుండి 2018 నుండి 2021 వరకు అమలులో ఉన్న చట్టాలు సమగ్రంగా  ఉన్నాయి.

2016 జూన్ 1 వ తేదీ నాటికి స్వీకరించిన 299 చట్టాలు, తొలగించిన 44 చట్టాలు, 2014 జూన్ నుండి 2021 డిసెంబర్ వరకు  తిరస్కరించిన 27 చట్టాలు, 2021 డిసెంబర్ 31 వ తేదీ వరకు అమలులోఉన్న మొత్తం 287 చట్టాలు, 17 రెగ్యులేషన్లు ఈ 15 వాల్యూములలో ముద్రించారు.

భావి తరాలకు ఎంతో ఉపయోగకరం - సీఎస్ సోమేశ్ కుమార్ తెలంగాణ రాష్ట్రంలోని చట్టాలతో కూడిన సమగ్ర సమాచారం కలిగిన 15 సంపుటాలను ముద్రించడం పట్ల సచివాలయంలోని న్యాయ విభాగ అధికారులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ అభినందించారు. నేడు తన కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చట్టాలు అనే ఈ 15 వాల్యూముల పుస్తకాలను సీఎస్ ఆవిష్కరించారు. భవిష్యత్ తరాలకు ఈ సమగ్ర సమాచారం కలిగిన గ్రంధాలు ఉపయోగపడతాయని అన్నారు. దాదాపు తొమ్మిది వేల పేజీలతో కూడిన ఈ సంపుటాలను ముద్రించడం చాలా కఠిన మైన పని అని, దీనిని విజయవంతంగా నిర్వహించడం పట్ల న్యాయ విభాగ అధికారులను అభినందించారు.

తెలంగాణ న్యాయ బాండాగారం మొత్తం ఒకే దగ్గర లభించడం గొప్పదని అన్నారు. వీటివల్ల ఉద్యోగుల పనితీరులోకూడా గణనీయమైన అభివృద్ధి వస్తుందని సోమేశ్ కుమార్ తెలిపారు. కొత్తగా ముద్రించిన ఈ తెలంగాణ స్టేట్ ఆక్ట్ లకు చెందిన 15 వాల్యూములను రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు, ప్రభుత్వ కార్యదర్శులు, హైకోర్టు కు పంపడం జరుగుతుందని ప్రభుత్వ న్యాయ  శాఖ కార్యదర్శి సంతోష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ వెబ్ సైట్ https:law.telangana.gov.in /statelaws అనే వెబ్ సైట్ లో ఈ తెలంగాణ స్టేట్ యాక్ట్ లను అప్లోడ్ చేశామని సంతోష్ రెడ్డి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సాధారణ పరిపాలన న్యాయ శాఖ కు చెందిన అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.  

More Press Releases