Pawan Kalyan: నాకోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లను దింపారట: పవన్ కల్యాణ్

Pawan Kalyan speech in Razole
  • రాజోలులో వారాహి విజయభేరి సభ
  • హాజరైన పవన్ కల్యాణ్
  • జనసేనలో తాను మొదటితరం నాయకుడ్ని అని వెల్లడి
  • జగన్ లా వారసత్వం అందుకుని రాలేదని వ్యాఖ్యలు
  • తాను ఏ రోజూ డబ్బు కోసం వెంపర్లాడలేదని స్పష్టీకరణ
  • ఆత్మగౌరవం కోసం ప్రాణాలైనా వదిలేస్తానని ఉద్ఘాటన
కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం మలికిపురంలో ఏర్పాటు చేసిన వారాహి విజయభేరి సభకు జనసేనాని పవన్ కల్యాణ్ హాజరయ్యారు. జనసేన పార్టీలో తాను మొదటి తరం రాజకీయ నాయకుడ్ని అని వెల్లడించారు. జగన్ లాగా తాతలు, తండ్రుల నుంచి, 150 సంవత్సరాల నుంచి ఉన్న కాంగ్రెస్ నుంచి వచ్చినవాడ్ని కాదని అన్నారు. 

ఓ చిన్నపాటి ఉద్యోగి కొడుకునని, ప్రజల అభిమానంతో నటుడిగా ఎదిగానని వెల్లడించారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చినా, దాన్ని నిలబెట్టుకోలేకపోయామన్న బాధ ఒకవైపు, రాజకీయాల్లో కొనసాగడం అంత సులభం కాదంటూ వినిపించిన మాటలతో పంతం పట్టి రాజకీయాల్లో కొనసాగానని వివరించారు. ఎవరి ఆసరా లేకపోయినా దశాబ్దకాలంగా పార్టీని నడిపానంటే ప్రజలు ఇచ్చిన బలమే అందుకు కారణమని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. 

"జగన్ వెళ్లిపోయే సమయం ఆసన్నమైంది. శ్రీకాకుళం, విజయనగరం, గోదావరి జిల్లాలు, కోనసీమ, రైల్వే కోడూరు, కడప, రాజంపేట, తిరుపతి... ఎక్కడికి వెళ్లినా వైసీపీ ఓడిపోతుంది, ప్రభుత్వం మారిపోతుందన్న విషయం అర్థమైంది. 

రాజోలు ప్రాంతం... కోనసీమలోనిది. కొబ్బరిచెట్టును పెద్దకొడుకుగా చూసుకునే నేల ఇది. రాష్ట్ర విభజన సమయంలో అందరి దృష్టి కోనసీమపై ఉంది. కోనసీమ సుభిక్షమైన ప్రాంతం అని తెలంగాణ నాయకులు చెప్పేవారు. మీకు కోనసీమ ఉంది... మాకు అంత అభివృద్ధి చెందిన ప్రాంతం లేదు అని ఆ తెలంగాణ నేతలు చెప్పేవారు. కానీ పక్కనే గోదావరి ప్రవహిస్తున్నప్పటికీ గోదావరి జిల్లాల్లో తాగునీటి సమస్య ఉంది. ముఖ్యంగా కోనసీమ రైతాంగం క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చింది. జనసేన-టీడీపీ-బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక రైతాంగం కోసం ఎంత బలంగా నిలబడుతుందో మీరే చూస్తారు. 

రైతుల గురించి, రైతుల కష్టాలు, సమస్యల గురించి తెలియని అనంతబాబుకు వ్యవసాయ సహకార సంస్థకు చైర్మన్ పదవి ఇచ్చారు. అనంతబాబు అనే వ్యక్తి గురించి మీకు తెలుసు... తనకింద పనిచేసే దళిత డ్రైవర్ ను చంపేసి డోర్ డెలివరీ చేసిన వ్యక్తి. 

ఇద్దరు వ్యక్తులు కొట్టుకుంటేనే పోలీసులు కేసులు పెడతారు, జగన్ పై గులకరాయి విసిరితే ఓ కుర్రాడ్ని పట్టుకున్నారు. కానీ ఒక దళిత కులానికి చెందిన డ్రైవర్ ను ఎమ్మెల్సీ చంపేసి డోర్ డెలివరీ చేస్తే అతీగతీలేదు. ఇప్పుడదే ఎమ్మెల్సీ రోడ్డుపైకి వచ్చి వైసీపీకి ఓట్లు వేయాలని అడుగుతున్నాడు. 

అంబేద్కర్ వంటి మహనీయుడి పేరు కోనసీమ జిల్లాకు పెడితే ఎవరికి అభ్యంతరం ఉంటుంది? కానీ కులాల మధ్య చిచ్చుపెట్టేందుకు వైసీపీ యత్నిస్తోంది. వ్యక్తుల మధ్య గొడవలు కులాల మధ్య గొడవలు అయిపోతున్నాయి. పక్కనే ఉన్న రామచంద్రపురంలో తోట త్రిమూర్తులు, పిల్లి సుభాష్ చంద్రబోస్ మధ్య గొడవలు ఇలాగే కులాల మధ్య గొడవగా మారాయి. 

విజయవాడలో రంగా గారికి, దేవినేని నెహ్రూ గారికి గొడవ కులాల మధ్య గొడవలుగా మారాయి. సమాజంలో ఒక కులం లేకుండా మరో కులం పనిచేయలేదు. రాష్ట్రంలో దుష్టపరిపాలనకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. 

నేను వకీల్ సాబ్ అనే సినిమా చేశాను. నేను ఏ రోజూ డబ్బు కోసం వెంపర్లాడలేదు. నేనొచ్చి వీళ్ల కాళ్లు పట్టుకోవాలంట... అన్నా, జగనన్నా... మీరు కొంచెం కనికరిస్తే నా సినిమాకు డబ్బులు వస్తాయి అని బతిమాలుకోవాలంట! నేను ఒకటే చెప్పా... సినిమా మొత్తం యూట్యూబ్ లో ఫ్రీగా వదిలేస్తాను అని చెప్పా. ఎందుకంటే, ఆత్మగౌరవం అనేది చాలా ముఖ్యం. 

ఆత్మగౌరవం కోసం ప్రాణాలు వదిలేసుకుంటాం కానీ... ఎర్రచందనం చెట్లను నరికేవాళ్ల దగ్గర, కులాల మధ్య చిచ్చుపెట్టే వాళ్ల దగ్గర, మెగాస్టార్ చిరంజీవి గారిని తీసుకువచ్చి సీఎం టేబుల్ ముందు కూర్చోబెట్టే వారికి మేం లొంగం. జగన్ ఒకటి గుర్తుపెట్టుకో... ఇది 2009 కాదు... ఇది 2024. తెగించి రాజకీయాల్లోకి వచ్చాం. 

నాకోసం 40 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పిఠాపురం, గోదావరి జిల్లాల్లో దింపారట. ఒకటే చెబుతున్నా... నేను పవన్ కల్యాణ్ ని... ఇలాంటి వాటికి భయపడేవాడ్ని కాను. నాకు అసలు భయాలు ఉండవు... ఒకటే జీవితం. జగన్ లాంటి గూండాలకు, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వంటి దోపిడీదారులకు భయపడం. 

ఓసారి ఢిల్లీలో కేంద్రమంత్రి ఇంట పెళ్లికి వెళితే మిథున్ రెడ్డి నాతో మాట్లాడాడు. పీలేరు, చిత్తూరు ప్రాంతాల్లో బయటి నుంచి ఎవరినీ జోక్యం చేసుకోనివ్వబోమని చెప్పాడు. తమ నియోజకవర్గాల్లో వేలు పెడితే సహించబోమని, తాము ఎవరి జోలికి వెళ్లబోమని మిథున్ రెడ్డి స్పష్టం చేశాడు. 

నేను ఒకటే అడుగుతున్నా... వారిని ఎవరూ ప్రశ్నించకూడదా? వారు మాత్రం వచ్చి ప్రతి జిల్లాలో వేలు పెడుతుంటారు. మిథున్ రెడ్డి వచ్చి గోదావరి జిల్లాల్లో వేలు పెట్టొచ్చు... మనం మాత్రం వారి ప్రాంతాలకు వెళ్లి మాట్లాడకూడదు. నేను మిథున్ రెడ్డికి, పెద్దిరెడ్డికి, జగన్ కు ఒకటే చెబుతున్నా... ఇక్కడుంది జనసేన... మీకు భయపడే పార్టీ కాదు. మీరు ఒక చెయ్యి ఎత్తితే మేం లక్ష చేతులు ఎత్తుతాం" అంటూ పవన్ కల్యాణ్ హెచ్చరించారు.
Pawan Kalyan
Varahi Vijayabheri
Razole
Janasena
TDP-JanaSena-BJP Alliance

More Telugu News