Synthetic diamonds: నిమిషాల్లోనే కృత్రిమ వజ్రాలు రెడీ.. త్వరలో అందుబాటులోకి సరికొత్త టెక్నాలజీ!

  • ఇప్పుడున్న విధానం కన్నా తక్కువ సమయంలో తయారీ
  • ఖర్చు కూడా బాగా తగ్గుతుందంటున్న శాస్త్రవేత్తలు
  • సరికొత్త లిక్విడ్ మెటల్ అల్లాయ్ తో ప్రయోగం
synthetic diamonds made in minutes

వజ్రాలంటే ఇష్టపడనివారెవరూ ఉండరు. కానీ వాటి ధరే.. సామాన్యులకు అసలు అందుబాటులో ఉండదు. భూమ్మీద అత్యంత అరుదుగా వజ్రాలు లభ్యమవడమే దానికి కారణం. దీంతో కృత్రిమంగా వజ్రాలను తయారు చేసే టెక్నాలజీని శాస్త్రవేత్తలు ఇప్పటికే గుర్తించారు. కానీ ఆ పద్ధతిలో తీవ్రమైన ఖర్చు, రోజులకు రోజులు సమయం పడుతుంది. ఈ క్రమంలో కేవలం నిమిషాల్లోనే, తక్కువ ఖర్చుతో కృత్రిమ వజ్రాలను తయారు చేసే టెక్నాలజీని శాస్త్రవేత్తలు తాజాగా అభివృద్ధి చేశారు.

వజ్రాల తయారీ ఎలా..
కార్బన్ మూలకంలోని పరమాణువులు ఒక క్రమ పద్ధతి ప్రకారం అమరి ఉండి ఏర్పడేవే వజ్రాలు. ఇలా వజ్రాలు తయారు కావడానికి అత్యంత తీవ్రమైన ఉష్ణోగ్రతలు, అతి తీవ్రమైన పీడనం అవసరం. భూమి అంతర్భాగంలో ఉష్ణోగ్రతలు, పీడనం ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. సహజంగానే వజ్రాలు ఏర్పడతాయి.  అదే తరహా పరిస్థితులను  శాస్త్రవేత్తలు ల్యాబ్ లలో ఏర్పాటు చేసి కృత్రిమ వజ్రాలను తయారు చేస్తారు.

వేడి, పీడనం ఎంత అవసరం?
ఇప్పటివరకు ఉన్న టెక్నాలజీ ప్రకారం.. ల్యాబ్ లో కృత్రిమ వజ్రాలు తయారు చేయడానికి 1,600 సెంటీగ్రేడ్ ల ఉష్ణోగ్రత, 50 వేల అట్మాస్ఫియర్ పీడనం (అంటే ఒక సెంటీమీటర్ స్థలంపై 50 వేల కిలోల బరువు పెట్టింత ఒత్తిడి) అవసరం. ఇంతా చేసి ఒక్క చిన్న వజ్రాన్ని తయారు చేయడానికి ఏకంగా 12 రోజుల వరకు పడుతుంది. అన్ని రోజులు ఉష్ణోగ్రతను, పీడనాన్ని మెయింటైన్ చేయడం బోలెడంత ఖర్చు.

కొత్త టెక్నాలజీ ఏంటి?

  • తాజాగా కొరియా ఇనిస్టిట్యూట్ ఫర్ బేసిక్ సైన్స్ శాస్త్రవేత్తలు కొత్త విధానంలో కృత్రిమ వజ్రాల తయారీని అభివృద్ధి చేశారు. గాలియం, ఐరన్, నికెల్, సిలికాన్ మూలకాలతో కూడిన కొత్త లిక్విడ్ మెటాలిక్ పదార్థాన్ని తయారు చేశారు.
  • అందులో హైడ్రోజన్, మిథేన్ తో కూడిన వాయువులను ఉంచి వేడిని, ప్రెషర్ ను అప్లై చేశారు.
  • ఈ విధానంలో 1,025 సెంటీగ్రేడ్ ల ఉష్ణోగ్రతలోనే, మామూలుగా వాడే ప్రెషర్ లో పావువంతుతోనే సన్నని డైమండ్ పొరలు తయారయ్యాయి. అదీ కొన్ని నిమిషాల్లోనే కావడం విశేషం.
  • ఈ విధానాన్ని మరింత అభివృద్ధి చేస్తే.. పూర్తి స్థాయిలో వజ్రాలను తయారు చేయడానికి వీలవుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కొన్నేళ్లలోనే ఈ టెక్నాలజీ అందుబాటులోకి వస్తుందని.. కృత్రిమ వజ్రాల ధరలు చాలా వరకు దిగొచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు.

More Telugu News