అమ్మవారి షోడశ నామాలు పఠిస్తే ఫలితం !

దుర్గా అనే పేరే అమ్మవారి అసమానమైన శక్తిని ఆవిష్కరిస్తూ వుంటుంది. ఆ తల్లి చల్లని మనసును ప్రేమగా ప్రతిబింబిస్తూ వుంటుంది. తన బిడ్డలకు ఎలాంటి కష్టం కలగనీయకుండా తల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ వుంటుంది. వాళ్ల సమస్యలను తీర్చడానికి ఎన్నో త్యాగాలు చేస్తుంది ... సంతోషపెట్టడానికి తన జీవితాన్ని పణంగా పెడుతుంది.

అలాంటి అమ్మలగన్న అమ్మ అనురాగాన్ని కొలవడం ఎవరికీ సాధ్యం కాదు. అమ్మ ఒడిలో గల బిడ్డ ఎంత భద్రతను పొందుతాడో, ఆ అమ్మవారి కరుణలోను అంతటి భరోసాను పొందుతాడు. జీవితంలో అనేక సమస్యల వలన దారిద్ర్యం ... దుఃఖం కలుగుతూ ఉంటాయి. అలాంటి దారిద్ర్యాన్ని ... దుఃఖాన్ని దూరంచేసేదిగా దుర్గమ్మవారు దర్శనమిస్తుంది.

ఆ తల్లి అనేక రూపాలతో ... నామాలతో భక్తులను అనుగ్రహిస్తూ వుంటుంది. అమ్మా అనే పిలుపుతో మంచులా కరిగిపోయి ... ప్రవాహపు వేగంతో తన బిడ్డను చేరుకునే అమ్మవారికి సంబంధించి 'షోడశ నామాలు' అత్యంత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. దుర్గ .. నారాయణి .. ఈశాని .. విష్ణుమాయ .. శివా .. సతీ .. నిత్య .. సత్య .. భగవతి .. శర్వాణి .. సర్వమంగళ .. అంబికా .. వైష్ణవి .. గౌరీ .. పార్వతీ .. సనాతనీ .. అనేవి అమ్మవారి షోడశ నామాలుగా చెప్పబడుతున్నాయి.

ఈ నామాలను అనునిత్యం పఠించడం వలన అనేక దోషాలు నశించి సకల శుభాలు చేకూరతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. ఈ షోడశ నామాలను పఠిస్తూ వుండటం వలన, ఆ జగజ్జనని అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుందని స్పష్టం చేయబడుతోంది.


More Bhakti News