మనోభీష్టాలు నెరవేర్చే మాస శివరాత్రి

పరమ శివుడికి 'మాసశివరాత్రి' అత్యంత ప్రీతికరమైన రోజుగా చెప్పబడుతోంది. ఈ రోజున ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించడం వలన, కోరిక కోరికలు నెరవేరుతాయని ఆధ్యాత్మిక గ్రంధాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి ... పూజా మందిరాన్ని అలంకరించి ... సదా శివుడికి పూజాభిషేకాలు నిర్వహించాలి. స్వామికి ఇష్టమైన పాయసాన్ని నైవేద్యంగా సమర్పించాలి.

ఉపవాస దీక్షను స్వీకరించి 'ప్రదోష కాలం'లో అంటే సాయం సమయంలో శివుడిని భక్తి శ్రద్ధలతో ఆరాధించాలి. అభిషేకం అనంతరం స్వామివారిని బిల్వదళాలతో అర్చించాలి. ప్రదోష కాలంలో శివాలయాన్ని దర్శించి పూజలు జరిపించడం మరీ మంచిది. ప్రదోష కాలంలో కైలాసంలో శివుడు తాండవమాడుతూ ఉంటాడట.

ఈ సమయంలో పార్వతీదేవి బంగారు సింహాసనంపై ఆశీనురాలై వుంటుంది. లక్ష్మీదేవి పాటపాడుతూ వుండగా, పరమశివుడి తాండవానికి అనుగుణంగా శ్రీమహావిష్ణువు మద్దెల వాయిస్తూ ఉంటాడు. దేవేంద్రుడు వేణువు వాయిస్తూ వుండగా, సరస్వతీదేవి వీణను మీటుతూ వుంటుంది. మనోహరమైన ఈ దృశ్యాన్ని సమస్త దేవతలు సంతోషంతో తిలకిస్తూ వుంటారు.

ఈ సమయంలో ఆదిదేవుడి నామాన్ని స్మరించినా ... ఆయనకి పూజాభిషేకాలు నిర్వహించినా మహా పుణ్యమనీ ... మనోభీష్టాలు నెరవేరుతాయని చెప్పబడుతోంది. అందువలన మాసశివరాత్రి రోజున ఉపవాస జాగరణలనే నియమాలను పాటిస్తూ, ప్రదోష కాలంలో సదాశివుడిని ఆరాధించాలి. అనుక్షణం ఆయన నామాన్ని స్మరిస్తూ తరించాలి.


More Bhakti News