హైదరాబాద్‌లో దారుణం... యజమాని దంపతులకు మత్తుమందు ఇచ్చి భారీ దోపిడీ

  • హైదరాబాద్ కాచిగూడలో వ్యాపారి ఇంట్లో భారీ దోపిడీ
  • యజమాని దంపతులకు ఆహారంలో మత్తుమందు కలిపిన నేపాలీ పనివాళ్లు
  • సుమారు రూ. 50 లక్షల నగదు, కిలో బంగారం అపహరణ
  • పోలీసుల అదుపులో ఒక నిందితురాలు... మరో నలుగురి కోసం తీవ్ర గాలింపు
  • ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు
నమ్మిన పనివాళ్లే యజమానులకు తీరని ద్రోహం చేశారు. కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని బర్కత్‌పురాలో నివాసముంటున్న ఓ వ్యాపారవేత్త దంపతులకు మత్తుమందు ఇచ్చిన పనివాళ్లు...  ఇంట్లోని భారీ మొత్తంలో నగదు, బంగారంతో ఉడాయించారు. ఆదివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చి స్థానికంగా కలకలం రేపింది.

బర్కత్‌పురాకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త హేమరాజ్ ఇంట్లో ఏడాది క్రితం నేపాల్‌కు చెందిన ఓ మహిళ పనిమనిషిగా చేరింది. ఆమె పనితీరుతో నమ్మకం కుదిరిన హేమరాజ్, ఆ మహిళ పరిచయం చేసిన మరో నలుగురు నేపాలీలను కూడా పనిలో పెట్టుకున్నారు. ఇటీవల హేమరాజ్ కుమారుడు, కోడలు వేసవి సెలవుల నిమిత్తం విదేశాలకు (బ్యాంకాక్) వెళ్లారు. ఇంట్లో వృద్ధ దంపతులు మాత్రమే ఒంటరిగా ఉంటున్నారని గమనించిన నేపాలీ పనివాళ్ల బృందం, ఇదే అదనుగా భావించి దోపిడీకి పథకం పన్నారు.

ఆదివారం సాయంత్రం, హేమరాజ్ దంపతులకు వారు తినే ఆహారంలో ద్రవరూపంలో ఉన్న మత్తుమందును కలిపినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. అది తిన్న కొద్దిసేపటికే దంపతులిద్దరూ అపస్మారక స్థితిలోకి జారుకున్నారు. వెంటనే అప్రమత్తమైన నిందితులు, ఇంట్లో బీరువాలో దాచిన సుమారు రూ. 50 లక్షల నగదు, కిలో బరువున్న బంగారు ఆభరణాలను దోచుకున్నారు. అనంతరం, హేమరాజ్‌కు చెందిన కారులోనే అక్కడి నుంచి పరారయ్యారు.

సోమవారం ఉదయం రోజూ మాదిరిగా వాకింగ్‌కు వెళ్లే హేమరాజ్ ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో ఆయన స్నేహితులు, ఇరుగుపొరుగు వారికి అనుమానం వచ్చింది. ఇంట్లోకి వెళ్లి చూడగా, హేమరాజ్, ఆయన భార్య స్పృహ లేకుండా పడి ఉండటాన్ని గమనించారు. వెంటనే వారిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారిద్దరి పరిస్థితి నిలకడగా ఉన్నట్లు సమాచారం.

బాధితుల బంధువుల ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితులు పరారైన కారును సంతోష్ నగర్ ప్రాంతంలో గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ దోపిడీతో సంబంధం ఉన్నట్లు అనుమానిస్తున్న నేపాల్‌కు చెందిన ఒక మహిళను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, నగరం విడిచి వెళ్లకుండా అన్ని మార్గాల్లో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

గతంలో కూడా ఇతర రాష్ట్రాలు, దేశాల నుంచి వచ్చి పనికి కుదిరే వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని, వారి పూర్తి వివరాలు, గుర్తింపు పత్రాలను పరిశీలించాకే పనిలో పెట్టుకోవాలని పోలీసులు పలుమార్లు హెచ్చరించిన నేపథ్యంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.


More Telugu News