KTR: తెలంగాణలో కాంగ్రెస్ కు బీజేపీ ప్రత్యామ్నాయం కాదు... అసలు ఫైట్ మాతోనే: కేటీఆర్

KTR says BJP is not an alternative to Congress in Telangana
  • తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయ శక్తి కాదన్న కేటీఆర్
  • అసలు రాజకీయ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యేనని ఉద్ఘాటన 
  • కాంగ్రెస్ 24 నెలల పాలన వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపు
  • పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కేవలం గాలివాటమేనని వ్యాఖ్య
  • మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తమకే పట్టం కడతారని ధీమా
తెలంగాణలో బీజేపీ ఎప్పటికీ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అసలైన రాజకీయ పోరు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్యే ఉంటుందని ఉద్ఘాటించారు. ఆదివారం నాడు ఆదిలాబాద్, మెదక్ జిల్లాల ముఖ్య నేతలతో పురపాలక ఎన్నికల సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు.

పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ సాధించిన గెలుపు కేవలం గాలివాటం మాత్రమేనని కొట్టిపారేశారు. ఆ సమయంలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్లే అది సాధ్యమైందని, క్షేత్రస్థాయిలో బీజేపీకి ఎలాంటి బలం లేదని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ సీనియర్ నేతలు ఘోరంగా ఓడిపోయిన విషయాన్ని గుర్తుచేశారు.

గడిచిన 24 నెలల కాంగ్రెస్ పాలన పూర్తిగా వైఫల్యాలతో నిండిపోయిందని కేటీఆర్ తీవ్రంగా విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి, అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిందని దుయ్యబట్టారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ వైఫల్యాలను, హామీల వంచనను ప్రజలకు వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు.

కృష్ణా నది జలాల వాటా, ఇతర అంతర్రాష్ట్ర సమస్యల విషయంలో తెలంగాణ ప్రయోజనాలను కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతీస్తోందని కేటీఆర్ ఆరోపించారు. ఈ విషయంలో బీజేపీ కూడా మౌనంగా ఉంటూ రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శించారు.

ప్రజలు కాంగ్రెస్ 24 నెలల అసమర్థ పాలనను, బీఆర్ఎస్ పదేళ్ల అభివృద్ధిని బేరీజు వేసుకుంటున్నారని తెలిపారు. ఇటీవలి ఉప ఎన్నికలు, పంచాయతీ పోల్స్‌లో ప్రజలు బీఆర్ఎస్ వైపే మొగ్గు చూపుతున్నారని, రాబోయే మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇదే పునరావృతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో సీనియర్ నేత, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కూడా పాల్గొన్నారు.
KTR
KTR Telangana
Telangana politics
BRS party
Congress party
BJP Telangana
Telangana elections
Revanth Reddy
Harish Rao
Telangana government

More Telugu News