NHAI: ఏపీలో 6 రోజుల్లో 52 కిలోమీటర్ల రహదారి నిర్మాణం... 4 గిన్నిస్ రికార్డులు నమోదు

NHAI Achieves Guinness Records for Bengaluru Vijayawada Economic Corridor
  • రాష్ట్రంలో జాతీయ రహదారి నిర్మాణంలో సరికొత్త గిన్నిస్ రికార్డులు
  • బెంగళూరు-విజయవాడ కారిడార్ పనుల్లో 6 రోజుల్లో 52 కి.మీ. నిర్మాణం
  • సత్యసాయి జిల్లాలో రెండు విభాగాల్లో రికార్డులు నమోదు
  • నిర్మాణ సంస్థ, అధికారులను అభినందించిన సీఎం చంద్రబాబు
  • ఈ కారిడార్‌పై మొత్తంగా నాలుగు గిన్నిస్ రికార్డులు
ఆంధ్రప్రదేశ్‌లో జాతీయ రహదారి నిర్మాణ పనులు రికార్డు స్థాయిలో దూసుకెళుతున్నాయి. బెంగళూరు-కడప-విజయవాడ ఎకనామిక్ కారిడార్ నిర్మాణంలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ) మరో రెండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకుంది. కేవలం 6 రోజుల్లో 52 కిలోమీటర్ల (156 లేన్ కిలోమీటర్లు) మేర రహదారిని నిర్మించి ఈ ఘనత సాధించింది.

సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గ పరిధిలోని వానవోలు-వంకరకుంట-ఓదులపల్లె సెక్షన్‌లోని ప్యాకేజ్-2, 3 పనుల్లో ఈ రికార్డులు నమోదయ్యాయి. ఈ నెల 6వ తేదీ ఉదయం 10.07 గంటల నుంచి 11వ తేదీ ఉదయం వరకు నిరంతరాయంగా పనులు చేపట్టారు. ఈ క్రమంలో రికార్డు స్థాయిలో 57,500 మెట్రిక్ టన్నుల కాంక్రీటును వేయడం, అత్యంత వేగంగా పేవింగ్ పూర్తి చేయడం ద్వారా రెండు విభాగాల్లో గిన్నిస్ రికార్డులు దక్కాయి.

ఈ బృహత్కార్యం కోసం కాంట్రాక్ట్ సంస్థ రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్.. 70 టిప్పర్లు, 5 మిక్సింగ్ ప్లాంట్లు, 17 రోలర్లను వినియోగించింది. పూర్తి నాణ్యతా ప్రమాణాలతో ఈ పనులను పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. ఇదే సంస్థ గతంలో ఒక్క రోజులో 28.896 లేన్ కిలోమీటర్ల మేర రోడ్డు నిర్మించి రెండు గిన్నిస్ రికార్డులు సాధించింది. తాజా విజయంతో బెంగళూరు-విజయవాడ ఎకనమిక్ కారిడార్‌కు మొత్తంగా నాలుగు గిన్నిస్ రికార్డులు లభించినట్లయింది.

ఈ రికార్డు విజయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఎన్‌హెచ్‌ఏఐ, రాష్ట్ర అధికారులు, రాజ్ పథ్ ఇన్ఫ్రాకాన్ సంస్థకు ఆయన అభినందనలు తెలిపారు. ఇదే స్ఫూర్తితో ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించిన మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని సూచించారు.
NHAI
National Highway Authority of India
Andhra Pradesh
Bengaluru Vijayawada Economic Corridor
Raj Path Infracon
Guinness World Record
road construction
economic corridor
పుట్టపర్తి
Chandrababu Naidu

More Telugu News