ఐపీఎల్‌లో చ‌రిత్ర సృష్టించిన భువనేశ్వర్ కుమార్

  • ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా భువీ
  • 179 మ్యాచుల్లో 184 వికెట్లు పడగొట్టిన భువ‌నేశ్వ‌ర్‌
  • ఇంత‌కుముందు ఈ రికార్డు డ్వేన్ బ్రావో (183) పేరిట‌
  • అలాగే ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా మ‌రో రికార్డు
  • భువీ కంటే ముందున్న‌ యుజ్వేంద్ర చాహల్ (206), పియూష్ చావ్లా (192) 
రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) బౌల‌ర్ భువనేశ్వర్ కుమార్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌)లో స‌రికొత్త చ‌రిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్‌గా భువీ రికార్డుకెక్కాడు. సీఎస్‌కే మాజీ బౌల‌ర్ డ్వేన్ బ్రావోను అధిగమించి న‌యా రికార్డు సృష్టించాడు. సోమవారం ముంబ‌యి ఇండియన్స్ (ఎంఐ)తో జరిగిన మ్యాచ్‌లో తిలక్ వర్మ వికెట్‌తో భువనేశ్వర్ ఈ ఘనతను సాధించాడు.

35 ఏళ్ల వయసున్న ఈ స్వింగ్ మాస్ట్రో, టోర్నమెంట్ చరిత్రలో 179 మ్యాచుల్లో 184 వికెట్లు పడగొట్టాడు. ఈ వికెట్‌తో భువనేశ్వర్ ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా కూడా నిలిచాడు. భువీ కంటే యుజ్వేంద్ర చాహల్ (206), పియూష్ చావ్లా (192) మాత్రమే ముందున్నారు.

ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్లు వీరే..

184 - భువనేశ్వర్ కుమార్ (179 ఇన్నింగ్స్)
183 - డ్వేన్ బ్రావో (158 ఇన్నింగ్స్)
170 - లసిత్ మలింగ (122 ఇన్నింగ్స్)
165 - జస్ప్రీత్ బుమ్రా (134 ఇన్నింగ్స్)
144 - ఉమేశ్‌ యాదవ్ (147 ఇన్నింగ్స్)


ఈ సీజన్‌లో ఐపీఎల్‌లో భువనేశ్వర్ కుమార్‌కు ఇది మూడో వికెట్. కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్‌)తో జరిగిన ఆర్‌సీబీ ఓపెనర్ తప్ప ఈ సీజన్‌లోని అన్ని మ్యాచ్‌లు భువ‌నేశ్వ‌ర్‌ ఆడాడు. ముంబ‌యి మ్యాచ్‌కు ముందు, గత 11 సంవత్సరాలుగా స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ (ఎస్ఆర్‌హెచ్‌) జట్టులో ఉన్న తర్వాత బెంగ‌ళూరు జట్టుతో చేర‌డంపై భువీ మాట్లాడాడు. 

"ఒకే జట్టు కోసం 11 సంవత్సరాలు ఆడి, కొత్త జట్టులోకి రావడం ఎవ‌రికైనా ఇబ్బందిగానే అనిపిస్తుంది. కానీ ఆర్‌సీబీలో వాతావ‌ర‌ణం భిన్నంగా ఉంటుంది. వారు అందరు ఆటగాళ్లను స్వాగతించే, ఆద‌రించే విధానం నిజంగా ప్రత్యేకమైంది. కాబట్టి బెంగ‌ళూరులో ఉండటం గొప్ప అనుభూతి" అని భువనేశ్వర్ కుమార్ అన్నాడు.


More Telugu News