చెన్నై టెక్కీ వేధింపుల దావా.. పోలీసుల‌కు మద్రాస్ హైకోర్టు కీల‌క సూచ‌న‌!

  • చెన్నైకి చెందిన ఓ టెక్కీ వివాహ వివాదంపై అతని భార్య పోలీసుల‌కు ఫిర్యాదు
  • ఆమె ఫిర్యాదుతో టెక్కీ ప్రసన్న శంకర్ పై పోలీసుల వేధింపులు
  • దాంతో మద్రాస్ హైకోర్టును ఆశ్ర‌యించిన శంక‌ర్  
చెన్నైకి చెందిన ఓ టెక్కీ వివాహ వివాదంపై అతని భార్య దాఖలు చేసిన ఫిర్యాదుకు సంబంధించి ఆయనను వేధించవద్దని మద్రాస్ హైకోర్టు పోలీసులను ఆదేశించింది.

వివ‌రాల్లోకి వెళితే... రిప్లింగ్ సహ వ్యవస్థాపకుడు ప్రసన్న శంకర్ చెన్నై పోలీసులు తనను వేధించారని, తన భార్య తనపై తప్పుడు ఫిర్యాదు చేసిందని ఆరోపించారు. ఈ మేర‌కు మ‌ద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. పోలీసులు తన తల్లి ఇంటికి వెళ్లి తన స్నేహితుడిని అక్రమంగా అరెస్టు చేయడమే కాకుండా, తన ఆచూకీపై విచారణ చేస్తున్నారని ఆయన త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. చెన్నైలోని తన వెకేషన్ హోమ్‌పై పోలీసులు దాడి చేసి, కేర్‌టేకర్ ఫోన్ తీసుకోవ‌డంతో పాటు సీసీటీవీ కెమెరాలను స్వాధీనం చేసుకున్నారని ఆయన ఆరోపించారు.

తన భార్య దివ్య తప్పుడు ఫిర్యాదు ఆధారంగా పోలీసులు పదే పదే సమన్లు జారీ చేస్తున్నారని, అనుచిత విచారణలు చేస్తున్నారని, బలవంతపు చర్యలు తీసుకుంటామని బెదిరిస్తున్నారని శంకర్ కోర్టుకు తెలిపాడు. అంతకుముందు శంకర్ తన స్నేహితుడిని కస్టడీ నుండి విడిపించుకోవడానికి ఒక ఏసీపీ, ఎస్ఐ తన నుండి రూ.25 లక్షలు డిమాండ్ చేశారని సోషల్ మీడియాలో ఆరోపించారు. అత‌ని పిటిష‌న్‌ను విచారించిన కోర్టు ఇక‌పై అత‌డిని వేధించ‌వ‌ద్ద‌ని పోలీసుల‌కు సూచించింది. 

కాగా, శంకర్‌తో దివ్యకు 2012 సెప్టెంబర్ లో వివాహమైంది. ఈ దంప‌తుల‌కు 2016లో ఒక కుమారుడు జన్మించాడు. తన భార్య మాన‌సిక వేధింపులు, వివాహేత‌ర సంబంధం కారణంగా తమ వివాహబంధం దెబ్బతిన్నదని అతను కోర్టుకు తెలిపాడు. ఆ తర్వాత చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసిన‌ట్లు చెప్పాడు.


More Telugu News