భార్య‌కు ఆమె ప్రియుడితో పెళ్లి చేసిన భ‌ర్త‌.. అలా ఎందుకు చేయాల్సి వ‌చ్చిందో వివ‌ర‌ణ‌!

  • యూపీలోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో ఘటన 
  • భార్య రాధిక‌ను ఆమె ప్రియుడు విశాల్‌కుమార్‌కి ఇచ్చి పెళ్లి చేసిన భర్త బ‌బ్లూ 
  • మీరట్ ఘ‌ట‌న‌నే త‌న‌కు ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కార‌ణ‌మని వెల్ల‌డి
  • తామిద్దరం ప్రశాంతంగా జీవించాల‌నే ఈ నిర్ణ‌య‌మ‌న్న బ‌బ్లూ
ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని సంత్ కబీర్‌నగర్ జిల్లాలో బ‌బ్లూ అనే వ్య‌క్తి త‌న భార్య రాధిక‌ను ఆమె ప్రియుడు విశాల్‌కుమార్‌కి ఇచ్చి పెళ్లి జ‌రిపించిన‌ వార్త నెట్టింట వైర‌ల్‌గా మారింది. అయితే, తాజాగా అత‌డు అలా ఎందుకు చేశాడో వివ‌రించాడు. "ఇటీవలి రోజుల్లో భర్తలను వారి భార్యలు చంపడం మనం చూశాము" అని బబ్లూ వార్తా సంస్థ పీటీఐతో అన్నాడు. ఇటీవల దేశ‌వ్యాప్తంగా క‌ల‌క‌లం సృష్టించిన‌ మీరట్ ఘ‌ట‌న‌ (వారం రోజుల క్రితం ముస్కాన్ అనే యువ‌తి త‌న భ‌ర్త‌ను ప్రియుడితో క‌లిసి ముక్క‌లుగా న‌రికి డ్ర‌మ్ములో దాయ‌డం) తను ఈ నిర్ణ‌యం తీసుకోవడానికి కార‌ణ‌మైందని తెలిపాడు.

"మీరట్‌లో ఏమి జరిగిందో చూసిన తర్వాత తామిద్దరం ప్రశాంతంగా జీవించగలిగేలా నా భార్యను ఆమె ప్రియుడితో వివాహం చేయాలని నిర్ణయించుకున్నాను" అని బ‌బ్లూ చెప్పాడు. కాగా, వేరే రాష్ట్రానికి వెళ్లి కూలి ప‌నులు చేసే బ‌బ్లూకు రాధిక‌తో 2017లో వివాహ‌మైంది. వీరికి ఇద్ద‌రు సంతానం. ఈ క్ర‌మంలో రాధిక‌కు విశాల్ అనే యువ‌కుడితో వివాహేత‌ర సంబంధం ఏర్ప‌డింది. ఆ విష‌యం తెలుసుకున్న‌ బ‌బ్లూ ఆమెను ప్ర‌శ్నించాడు. 

కానీ, ఆమె ప్రియుడిని వ‌దులుకునేందుకు ఒప్పుకోలేదు. ఈ క్ర‌మంలో మీర‌ట్ ఘ‌ట‌న గురించి తెలుసుకున్న బ‌బ్లూ వారిద్ద‌రికీ పెళ్లి చేయాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. త‌న‌కు హాని జరగకుండా ఉండటానికి తానే స్వ‌యంగా వారి వివాహానికి ఏర్పాటు చేశాన‌ని చెప్పుకొచ్చాడు. అతను మొదట కోర్టులో తన భార్య, ఆమె ప్రేమికుడి వివాహం జరిపించాడు. ఆపై వారిని ఒక ఆలయానికి తీసుకెళ్లాడు. అక్కడ వారు దండలు మార్చుకున్నారు. 


More Telugu News