NHAI: ఫాస్టాగ్‌లపై కేంద్రం శుభవార్త... వాహనదారులకు భారీ ఊరట

NHAI Announces Good News for FASTag Users
  • కార్లు, జీపులు, వ్యాన్ల ఫాస్టాగ్‌లకు కేవైసీ ప్రక్రియను రద్దు చేసిన ఎన్ హెచ్ఏఐ
  • ఫిబ్రవరి 1నుంచి అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు
  • ఫిర్యాదులు వస్తే తప్ప పాత ఫాస్టాగ్‌లకు కూడా కేవైవీ అవసరం లేదన్న సంస్థ
  • యాక్టివేషన్‌కు ముందే వాహన్ డేటాబేస్‌తో వివరాల వెరిఫికేషన్
  • ఫాస్టాగ్ జారీ చేసే బ్యాంకులకే పూర్తిస్థాయి ధృవీకరణ బాధ్యత
జాతీయ రహదారులపై ప్రయాణించే వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. కార్లు, జీపులు, వ్యాన్‌లకు సంబంధించిన ఫాస్టాగ్‌ల కోసం 'నో యువర్ వెహికల్' (KYV) ప్రక్రియను రద్దు చేస్తున్నట్లు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) గురువారం ప్రకటించింది. ఈ కొత్త నిబంధన ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది వాహనదారులకు పెద్ద ఊరట లభించనుంది.

ఫాస్టాగ్ యాక్టివేట్ అయిన తర్వాత కేవైవీ పేరుతో ఎదురవుతున్న ఇబ్బందులు, జాప్యాన్ని నివారించేందుకే ఈ సంస్కరణ తీసుకొచ్చినట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. వాహనానికి సంబంధించిన సరైన పత్రాలు ఉన్నప్పటికీ, కేవైవీ అప్‌డేట్ కాలేదన్న కారణంతో వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారని, తాజా నిర్ణయంతో ఆ సమస్యలు తొలగిపోతాయని పేర్కొంది.

కొత్త ఫాస్టాగ్‌లకే కాకుండా, ఇప్పటికే జారీ చేసిన ఫాస్టాగ్‌లకు కూడా ఈ మినహాయింపు వర్తిస్తుంది. అయితే, ఫాస్టాగ్ దుర్వినియోగం, తప్పుగా జారీ చేయడం వంటి నిర్దిష్ట ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రమే కేవైవీ అవసరమవుతుందని NHAI స్పష్టం చేసింది. ఎలాంటి ఫిర్యాదులు లేని పాత ఫాస్టాగ్‌లకు కేవైవీ తప్పనిసరి కాదు.

వినియోగదారులకు ప్రక్రియను సులభతరం చేస్తూనే, వ్యవస్థలో పారదర్శకత, కచ్చితత్వాన్ని పెంచేందుకు NHAI చర్యలు చేపట్టింది. ఇకపై ఫాస్టాగ్ యాక్టివేషన్‌కు ముందే వాహన్ డేటాబేస్ నుంచి వాహన వివరాలను ధృవీకరించుకోవాలని బ్యాంకులకు కఠిన నిబంధనలు విధించింది. 

ఒకవేళ వాహన్ పోర్టల్‌లో వివరాలు లేకపోతే, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) ద్వారా సరిచూసుకున్న తర్వాతే ఫాస్టాగ్‌ను యాక్టివేట్ చేయాల్సి ఉంటుంది. ఆన్‌లైన్‌లో విక్రయించే ఫాస్టాగ్‌లకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఈ మార్పులతో వెరిఫికేషన్ బాధ్యత పూర్తిగా బ్యాంకులపైనే ఉంటుందని, వినియోగదారులకు ఇబ్బందులు లేని ప్రయాణ అనుభవాన్ని అందించడమే లక్ష్యమని NHAI తెలిపింది.


NHAI
FASTag
FASTag KYC
National Highways Authority of India
vehicle owners
road transport
KYC process
Vahan database
toll tax

More Telugu News