Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

స్థానిక ఎన్నికలు నిలిపివేయండి.. అధికారులకు పోలవరం వాసుల వినతి

Polavaram residents demand officials to stop local body elections
Advertisement
  • పంచాయతీల సరిహద్దులపై ప్రత్యేక గెజిట్ జారీ చేయాలని వినతి
  • విలీనంతో గ్రామాల్లో గందరగోళం నెలకొందని గ్రామస్థుల ఆవేదన
  • అధికారులకు వినతి పత్రాలు సమర్పించిన వివిధ పార్టీల నేతలు
Advertisement
స్థానిక సంస్థల ఎన్నికలను తక్షణమే నిలిపివేయాలని, పంచాయతీలు, ఎంపీటీసీ నియోజకవర్గాల సరిహద్దులపై స్పష్టతనిస్తూ ప్రత్యేక గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయాలని పోలవరం ప్రాజెక్టు ముంపు గ్రామాల నిర్వాసితులు డిమాండ్ చేశారు. ఏలూరు జిల్లా పోలవరం మండలంలోని ఎల్‌ఎన్‌డీ పేట వాసులు, ఇతర నిర్వాసితులు బుధవారం పోలవరం ఆర్డీవో ఎం.వి. రమణ, తహసీల్దార్ బి. సాయిరాజుకు ఈ మేరకు వినతిపత్రాలు సమర్పించారు.

కొండ్రుకోట, తూటిగుంట, కొరుటూరు, పైడిపాక, దేవరగొంది వంటి గ్రామ పంచాయతీలను ఎల్‌ఎన్‌డీ పేట, రెడ్డి గణపవరం, పి. అంకంపాలెం, ఇటుకలకోట, పోలవరం పంచాయతీలలో విలీనం చేయడం వల్ల తమ గ్రామాలు విచ్ఛిన్నమయ్యాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విలీన ప్రక్రియ కారణంగా స్థానిక ప్రాతినిధ్యం, గ్రామసభల నిర్వహణ, గిరిజన హక్కుల విషయంలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వారు వాపోయారు.

ఈ సమస్యను పరిష్కరించకుండా ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని, ముందుగా తమ గ్రామాల పరిధిని స్పష్టంగా నిర్దేశిస్తూ ప్రత్యేక గెజిట్ జారీ చేసిన తర్వాతే ఎన్నికలు జరపాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు పైడా నాగరాజు, కొవ్వాసి శ్రీనివాసరావు, గోపాల్‌తో పాటు టీడీపీ నేతలు గుబ్బ రాంబాబు, ఇళ్ల సత్యనారాయణ, కొల్లేపర వేణుగోపాల్, చిక్కాల రాంబాబు, బీజేపీ నేత మోటు అయ్యప్ప, వైసీపీ నేతలు ఇళ్ల కళ్యాణ్, బాపిరాజు, పీసీ కమిటీ సభ్యులు మోడియం సింహాచలం, మూలం శ్రీనివాసరావు, తామా రాజు తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement
Polavaram project victims
Local body elections
Eluru district
Special gazette notification
Village boundary dispute
Andhra Pradesh local polls

More Telugu News