Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వైసీపీ మద్దతుదారులకు ఒకటే చెబుతున్నాం: పవన్ కల్యాణ్

Pawan Kalyan message to YCP supporters on development beyond politics
Advertisement
  • రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని పవన్ స్పష్టం
  • వైసీపీ మద్దతుదారులు ఉన్న పంచాయతీలకు కూడా నిధులు కేటాయించామని వెల్లడి
  • రూ.2,052 కోట్లతో 'అడవితల్లి బాట 2.0' కార్యక్రమాన్ని ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి
  • స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసైనికులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని విజ్ఞప్తి
  • గత వైసీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని పార్టీ రంగుల కోసం దుర్వినియోగం చేసిందని విమర్శ
Advertisement
"వైసీపీ మద్దతుదారులకు ఒకటే చెబుతున్నాం. మేం అభివృద్ధిని రాజకీయాలకు అతీతంగా చూస్తున్నాం. ఏ పార్టీ బతకాలనేది కాదు, వ్యవస్థలు బతకాలి, గ్రామాలు బాగుపడాలి, ప్రజల జీవితాలు మెరుగుపడాలి. పంచాయతీరాజ్ శాఖ బాధ్యతలు చేపట్టిన తర్వాత, వైసీపీ మద్దతు ఉన్న పంచాయతీలకు కూడా అవసరమైన నిధులు అందేలా చర్యలు తీసుకున్నాను" అని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆయన ఉద్ఘాటించారు. ఆదివారం పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గంలోని కాకవాడ గ్రామంలో "అడవితల్లి బాట 2.0" కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం జరిగిన సభలో ఆయన ప్రసంగించారు. తాము బాధ్యతలు స్వీకరించాక వైసీపీ మద్దతు ఉన్న పంచాయతీలకు కూడా నిధులు విడుదల చేశామని, తమకు ప్రజల శ్రేయస్సే ముఖ్యమని తెలిపారు.

ఈ సందర్భంగా రూ.2,052 కోట్ల అంచనా వ్యయంతో 2,569 అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినట్లు పవన్ కల్యాణ్ ప్రకటించారు. ఈ పథకం ద్వారా 1,341 గిరిజన ఆవాసాలకు 1,976 కిలోమీటర్ల మేర రహదారులు, 45 వంతెనలు నిర్మించనున్నట్లు వివరించారు. గత వైసీపీ ప్రభుత్వం గిరిజన గ్రామాల అభివృద్ధిని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, ప్రజావసరాలు తీర్చాల్సిన వందల కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వ భవనాలకు పార్టీ రంగులు వేయడానికి, వాటిని తొలగించడానికి దుర్వినియోగం చేసిందని తీవ్రంగా విమర్శించారు. అదే నిధులతో ఎన్నో గిరిజన గ్రామాలకు రహదారులు నిర్మించి ఉండవచ్చన్నారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్ర భవిష్యత్తు కోసం జనసైనికులు ఎన్నో త్యాగాలు చేశారని గుర్తుచేశారు. చంద్రబాబు అరెస్టు సమయంలోనూ రోడ్లపైకి వచ్చి పోరాడిన జనసైనికులు, వీరమహిళల త్యాగాలను మరువలేమని అన్నారు. వారి త్యాగాలకు గుర్తింపుగా, పొత్తు ధర్మాన్ని గౌరవిస్తూ రాబోయే స్థానిక ఎన్నికల్లో జనసేన కార్యకర్తలకు సముచిత ప్రాతినిధ్యం కల్పించాలని కూటమి నాయకులకు విజ్ఞప్తి చేశారు. స్థానిక ఎన్నికలు జనసైనికుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా ఉండాలని ఆకాంక్షించారు.

గిరిజన ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం ఎంతో క్లిష్టమైన ప్రక్రియ అని, కొండలను తొలచి, రాక్ కటింగ్ వంటి పనులు చేయాల్సి ఉంటుందని తెలిపారు. తాము నిర్మిస్తున్న రోడ్ల నాణ్యతను స్థానిక ప్రజలే పర్యవేక్షించాలని కోరారు. ఏమైనా లోపాలుంటే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. గిరిజనుల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఉద్యానవనాల అభివృద్ధి, పర్యాటక రంగ ప్రోత్సాహం, మొబైల్ కనెక్టివిటీ వంటి చర్యలు చేపడుతున్నామని వివరించారు. అటవీ అనుమతులు వేగవంతం చేసి సెల్ టవర్లు, రహదారుల నిర్మాణాలను పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు కోరిన పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్మాణానికి తక్షణమే ఆదేశాలు జారీ చేశారు. అధికార అహంకారంతో ప్రజలను భయపెట్టే రోజులు పోయాయని, తప్పును ప్రశ్నించే ధైర్యంతో పాటు బాధ్యతగా వ్యవహరించాలని ప్రజలకు సూచించారు.


Advertisement
Advertisement
Pawan Kalyan
Adavitalli Bata 2.0
Rampachodavaram Tribal Development
Andhra Pradesh Panchayat Raj
Jana Sena Local Body Elections
YCP Supporters Message

More Telugu News