ఇంట్లో కోట్ల రూపాయల చోరీ.. అయినా వెనక్కి తగ్గని మధుమిత.. డబ్బుతో డ్యాన్స్ చేస్తూ మరో రీల్!

ఇంట్లో కోట్ల రూపాయల చోరీ.. అయినా వెనక్కి తగ్గని మధుమిత.. డబ్బుతో డ్యాన్స్ చేస్తూ మరో రీల్!

Madhumita house robbery of crores of rupees yet she continues with money dance reels
  • యూట్యూబర్ మధుమిత ఇంట్లో 118 సవర్ల బంగారం చోరీ
  • కుటుంబం బయటకు వెళ్లిన సమయంలో దుండగుల ఘాతుకం
  • దొంగతనం తర్వాత డబ్బుతో డ్యాన్స్ చేస్తూ రీల్స్ పోస్ట్
  • గంటల వ్యవధిలో వైరల్ అయిన వీడియోలకు కోటిన్నర వ్యూస్
తమిళనాడుకు చెందిన ప్రముఖ యూట్యూబర్ మధుమిత ఏమాత్రం తగ్గడం లేదు. కోట్ల రూపాయల చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే మరో పోస్టుతో ముందుకొచ్చింది. ఈ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయి కోటిన్నర వ్యూస్ సాధించాయి. 

కన్నియాకుమారి (కన్యాకుమారి) జిల్లా నాగర్‌కోవిల్ సమీపంలోని తమ్మట్టుకోణంలో యూట్యూబర్, ఇన్‌ఫ్లుయెన్సర్ అయిన మధుమిత (29) తన భర్త వినోద్ కుమార్, రెండేళ్ల కుమార్తెతో నివసిస్తోంది. గురువారం సాయంత్రం 5 గంటలకు వారు తమ కుమార్తె పుట్టినరోజు కోసం బట్టలు కొనడానికి తిరునల్వేలికి వెళ్లారు. రాత్రి 11:50 గంటలకు తిరిగి వచ్చి చూడగా, ఇంటి వెనుక తలుపులు పగలగొట్టి ఉన్నాయి. లోపల బీరువాలో ఉన్న 118 సవర్ల బంగారు ఆభరణాలు (సుమారు రూ. కోటి విలువ), కొంత నగదు, డైమండ్ నగలు కనిపించకపోవడంతో వారు వెంటనే రాజకమంగళం పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సమాచారం అందుకున్న పోలీసులు, ఎస్పీ అన్షుల్ నగర్ ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఆధారాల సేకరణ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. సీసీటీవీ ఫుటేజ్, వేలిముద్రలను పరిశీలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా, మధుమిత తన సోషల్ మీడియాలో బంగారు నగలు, డబ్బు కట్టలు ప్రదర్శిస్తూ పోస్టులు పెట్టడం, బయటకు వెళ్లే వివరాలు తెలపడం వంటివి దొంగలకు సమాచారం అందించాయా? అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.

అయితే అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే, ఇంట్లో కోటి రూపాయల విలువైన చోరీ జరిగిన కొన్ని గంటల్లోనే మధుమిత ఇన్‌స్టాగ్రామ్‌లో 10 రీల్స్ పోస్ట్ చేసింది. తలపై డబ్బు కట్టలు పోసుకుని డ్యాన్స్ చేయడం, నోట్లను గాల్లోకి చల్లడం వంటి వీడియోలను "ఏదీ శాశ్వతం కాదు" అనే క్యాప్షన్‌తో పంచుకుంది. ఈ వీడియోలు క్షణాల్లో వైరల్ అయ్యాయి. కేవలం 40 గంటల్లో ఒక వీడియోకు 39 లక్షల వ్యూస్ రాగా, మిగిలిన వీడియోలతో కలిపి మొత్తం 1.5 కోట్ల వ్యూస్ వచ్చాయి. ఆమె ఫాలోవర్ల సంఖ్య కూడా 5 లక్షలకు చేరింది.

భారీ చోరీ జరిగినప్పటికీ ఆమె ప్రవర్తనపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు నిందితులను గుర్తించేందుకు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
Advertisement
Madhumita
YouTuber Madhumita Robbery
Tamil Nadu Influencer Theft
Madhumita Instagram Reels
Kanyakumari Robbery Case
Madhumita Money Dance Video

More Telugu News