Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

దేశంలో తగ్గుతున్న గ్యాస్ వాడకందార్ల సంఖ్య... కారణం ఇదే!

LPG Consumers in India decline significantly for the first time in a decade
Advertisement
  • దేశంలో తొలిసారిగా తగ్గిన ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులు
  • ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య 62 లక్షల కనెక్షన్ల తగ్గుదల
  • అమెరికా-ఇరాన్ యుద్ధంతో దిగుమతులపై తీవ్ర ప్రభావం
  • కొత్త కనెక్షన్లు నిలిపివేత, ఆధార్‌తో నకిలీల ఏరివేత
  • పైప్‌డ్ గ్యాస్ వాడకం పెరగడం కూడా ఓ కారణంగా వెల్లడి
Advertisement
దేశంలో గడిచిన దశాబ్ద కాలంలో తొలిసారిగా గృహ వినియోగ ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య గణనీయంగా తగ్గింది. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మొదటి వారం మధ్య సుమారు 62 లక్షల యాక్టివ్ గ్యాస్ కనెక్షన్లు తగ్గినట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో 333.9 మిలియన్లుగా ఉన్న వినియోగదారుల సంఖ్య, సెప్టెంబర్ నాటికి 327.7 మిలియన్లకు పడిపోయింది. పేద కుటుంబాల కోసం ఉద్దేశించిన ఉజ్వల పథకం లబ్ధిదారులు కూడా 6 లక్షల మేర తగ్గడం గమనార్హం.

ఈ తగ్గుదలకు ప్రధాన కారణం అమెరికా-ఇరాన్ మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణమేనని తెలుస్తోంది. ఈ ఉద్రిక్తతల కారణంగా గల్ఫ్ దేశాల నుంచి ఎల్పీజీ దిగుమతులకు ఆటంకం కలిగింది. భారత్ తన గ్యాస్ అవసరాల్లో దాదాపు 90 శాతం గల్ఫ్ నుంచే దిగుమతి చేసుకుంటున్న నేపథ్యంలో, సరఫరా వ్యవస్థలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో చమురు మార్కెటింగ్ కంపెనీలు కొత్త గృహ వినియోగ ఎల్పీజీ కనెక్షన్ల జారీని నిలిపివేశాయి.

అంతేకాకుండా, ఆధార్ ఆధారిత బయోమెట్రిక్ వెరిఫికేషన్ ద్వారా అధికారులు తనిఖీలను కఠినతరం చేశారు. దీని ద్వారా వాడకంలో లేని కనెక్షన్లు, ఒకే కుటుంబంలో ఉన్న బహుళ కనెక్షన్లు, ఇప్పటికే పైప్‌డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్‌జీ) వాడుతున్న ఇళ్లను గుర్తించి ఎల్పీజీ కనెక్షన్లను తొలగిస్తున్నారు. పీఎన్‌జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఆ కనెక్షన్లకు మారేలా ప్రభుత్వం ప్రోత్సహించడం కూడా ఈ తగ్గుదలకు మరో కారణం.

ప్రాంతాల వారీగా పరిశీలిస్తే, అత్యధికంగా దక్షిణ భారతదేశంలో 26.3 లక్షల కనెక్షన్లు తగ్గాయి. ఆ తర్వాత పశ్చిమ, ఉత్తర భారత దేశాల్లోనూ ఈ ప్రభావం అధికంగా కనిపించింది. దశాబ్దాలుగా క్రమంగా పెరుగుతూ వచ్చిన ఎల్పీజీ వినియోగదారుల సంఖ్య ఇలా ఒక్కసారిగా తగ్గడం ఇదే మొదటిసారి.
Advertisement
Advertisement
LPG Consumers
Domestic LPG India
Ujjwala Yojana
US Iran Conflict
PNG Gas Connection
Aadhaar Biometric Verification

More Telugu News