భారీగా తగ్గిన షారుక్‌ ఖాన్‌ సంపద.. అయినా భారత్‌లో సంపన్న నటుడు అతడే!

భారీగా తగ్గిన షారుక్‌ ఖాన్‌ సంపద.. అయినా భారత్‌లో సంపన్న నటుడు అతడే!

Shah Rukh Khan wealth drops significantly but he remains India richest actor
  • షారుక్‌ సంపద విలువ రూ.10,000 కోట్లు
  • ఏడాదిలో రూ.2,490 కోట్లు తగ్గిన సంపద
  • రూ.4,000 కోట్లతో రెండో స్థానంలో అమితాబ్‌
  • రూ.3,000 కోట్లతో తొలిసారి జాబితాలోకి సల్మాన్‌ ఖాన్‌
  • హృతిక్‌ సంపద రూ.2,500 కోట్లు
హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌ 2026 తాజా జాబితాలో బాలీవుడ్‌ స్టార్‌ షారుక్‌ ఖాన్‌ మరోసారి అత్యంత సంపన్న భారతీయ నటుడిగా నిలిచాడు. అతడి మొత్తం సంపద రూ.10,000 కోట్లుగా హురున్‌ వెల్లడించింది. రెడ్‌ చిల్లీస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌, నైట్‌ రైడర్స్‌ స్పోర్ట్స్‌ సహా అతడి వ్యాపారాల విలువను ఇందులో పరిగణనలోకి తీసుకుంది.

అయితే షారుక్‌ సంపద గత ఏడాదితో పోలిస్తే భారీగా తగ్గింది. 2025 హురున్‌ ఇండియా రిచ్‌ లిస్ట్‌లో అతడి సంపద రూ.12,490 కోట్లుగా ఉంది. అంటే ఏడాదిలో రూ.2,490 కోట్ల మేర తగ్గినట్లు లెక్క. ఈ ఏడాది ప్రారంభంలో విడుదలైన హురున్‌ గ్లోబల్‌ రిచ్‌ లిస్ట్‌లో షారుక్‌ సంపద రూ.10,800 కోట్లుగా నమోదైంది.

ఇక అమితాబ్‌ బచ్చన్‌ రూ.4,000 కోట్ల సంపదతో జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. గతేడాది ఆయన సంపద రూ.1,630 కోట్లుగా ఉండగా.. ఈసారి గణనీయంగా పెరిగింది. అమితాబ్‌ ప్రత్యక్షంగా వ్యాపారాలు నిర్వహించకపోయినా ఫ్యామిలీ ఆఫీస్‌ ద్వారా పలు కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాడు. రియల్‌ ఎస్టేట్‌లోనూ ఆయనకు పెట్టుబడులు ఉన్నాయి.

సల్మాన్‌ ఖాన్‌ తొలిసారి ఈ జాబితాలో చోటు దక్కించుకున్నాడు. అతడి సంపద రూ.3,000 కోట్లుగా ఉంది. హృతిక్‌ రోషన్‌ రూ.2,500 కోట్లతో జాబితాలో నిలిచాడు. 2025లో అతడి సంపద రూ.2,160 కోట్లుగా ఉండగా.. హెచ్‌ఆర్‌ఎక్స్‌ బ్రాండ్‌ వృద్ధితో ఈసారి పెరిగింది.

గతేడాది జాబితాలో ఉన్న జుహీ చావ్లా, కరణ్‌ జోహర్‌ ఈసారి చోటు దక్కించుకోలేదు. మరోవైపు ‘రామాయణ’ నిర్మాత నమిత్‌ మల్హోత్రా తండ్రి నరేశ్‌ మల్హోత్రా రూ.16,000 కోట్ల సంపదతో జాబితాలో ఉన్నారు.

షారుక్‌ 2023లో ‘పఠాన్‌’, ‘జవాన్‌’, ‘డంకీ’ సినిమాలతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు సాధించాయి. ప్రస్తుతం సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో ‘కింగ్‌’ చేస్తున్నాడు. ఇందులో కుమార్తె సుహానా ఖాన్‌ కూడా నటిస్తోంది. ఈ చిత్రం డిసెంబర్‌ 24న విడుదల కానుంది.
Advertisement
Shah Rukh Khan
Hurun India Rich List 2026
Richest Indian Actors
Amitabh Bachchan Net Worth
Salman Khan Net Worth
Bollywood Wealthiest Actors

More Telugu News