పుష్ప సినిమాలో ఆ పాత్ర నేను చేయాల్సింది.. కానీ!: శివాజీ
- ‘మంగళం శ్రీను’ పాత్ర తనకే రావాల్సి ఉందన్న శివాజీ
- ఆ పాత్ర సునీల్ కే రాసిపెట్టి ఉందని వ్యాఖ్య
- 'కూర్మావతారం' అనే చిత్రంలో కూడా తాను నటిస్తున్నట్టు వెల్లడి
టాలీవుడ్ నటుడు శివాజీ 'తెల్ల కాగితం’ సినిమా ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ... ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన దిగ్గజ చిత్రం ‘పుష్ప’కు సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. ‘పుష్ప’ చిత్రంలో దేశవ్యాప్తంగా ప్రశంసలు అందుకున్న ప్రతి నాయక ఛాయలున్న ‘మంగళం శ్రీను’ పాత్ర మొదట తనకే రావలసి ఉందని శివాజీ తెలిపారు.
ఈ సందర్భంగా శివాజీ మాట్లాడుతూ... "మంగళం శ్రీను పాత్రకు మొదట సుకుమార్ నన్నే అనుకున్నారు. కానీ ఒక పాత్ర ఎవరికి రాసి ఉంటే చివరికి వాళ్లకే దక్కుతుంది. నాకు రాసి లేని పాత్రను నేనెలా చేయగలను? ఆ పాత్ర సునీల్‌కే రాసి పెట్టి ఉంది, అందుకే ఆయన వద్దకు వెళ్లింది. సునీల్ ఆ పాత్రలో అద్భుతంగా జీవించారు, ఎవరు ఏ పాత్ర చేసినా చివరికి అది వాళ్లకే సరిపోతుంది" అని వ్యాఖ్యానించారు.
‘తెల్ల కాగితం’ విశేషాలను ఆయన పంచుకుంటూ... సినిమాల్లోకి రీ-ఎంట్రీ ఇచ్చే సమయంలో తాను విన్న రెండో కథ ఇదేనని, కథ బాగా నచ్చడంతో ఈ చిత్రాన్ని తానే నిర్మించాలని అనుకున్నట్లు తెలిపారు. అయితే ఈ కథ పలువురు నిర్మాతల చేతులు మారి, చివరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధినేత దిల్ రాజు, కృష్ణ కొమ్మలపాటి సంయుక్త నిర్మాణంలో తెరకెక్కి తన వద్దకే రావడంతో ఎంతో సంతోషంగా ఉందన్నారు. రమేశ్ బండ్రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో పాటు, గ్రాఫిక్స్ కు ప్రాధాన్యత ఉన్న ‘కూర్మావతారం’ అనే చిత్రంలోనూ తాను నటిస్తున్నట్లు శివాజీ వెల్లడించారు.