విడాకుల దిశగా మలయాళ తారలు విను మోహన్ - విద్య: 13 ఏళ్ల దాంపత్య బంధానికి ముగింపు?
- 2013లో ప్రేమ వివాహం చేసుకున్న విను మోహన్ , విద్య
- విడాకులకు సిద్ధమయ్యారంటూ జాతీయ మీడియాలో వార్తలు
- ఇన్స్టా ఖాతా నుంచి తన భార్యతో ఉన్న పలు ఫొటోలను తొలగించిన విను
మలయాళ సినీ రంగానికి చెందిన స్టార్ యాక్టర్స్ విను మోహన్, ఆయన భార్య విద్య విడిపోతున్నారనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్థలు పెరిగి, చివరకు విడాకులకు సిద్ధమయ్యారని జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 2013లో ప్రేమించి వివాహం చేసుకున్న ఈ జంట, సుమారు 13 ఏళ్ల తమ వైవాహిక బంధానికి ముగింపు పలకనున్నారనే వార్త మలయాళ సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
సోషల్ మీడియా వేదికగా నిత్యం క్రియాశీలకంగా ఉంటూ కలసి దిగిన ఫొటోలను పంచుకునే ఈ దంపతులు... ఇటీవల ఒకరికొకరు దూరంగా ఉంటున్నారని ప్రచారం సాగుతోంది. నటుడు విను మోహన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి భార్య విద్యతో ఉన్న పలు ఫొటోలను తొలగించడం ఈ విడాకుల పుకార్లకు మరింత బలంచేకూర్చింది. 2007లో 'నివేద్యం' చిత్రంతో నటుడిగా అరంగేట్రం చేసిన విను మోహన్, మోహన్‌లాల్ 'పులిమురుగన్', దుల్కర్ సల్మాన్‌తో 'జోమోంటే సువిశేషంగల్' వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించి మెప్పించారు. ఆయన భార్య విద్య కూడా తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో పలు చిత్రాలతో పాటు టెలివిజన్ షోలలో అలరించారు. అయితే, విడాకుల వార్తలపై ఈ జంట ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.