ఆ హాలీవుడ్ రీమేక్‌లో ఉచితంగానైనా నటిస్తా: విజయ్ సేతుపతి
- తన 'మహారాజా' సినిమా రీమేక్ హక్కులను హాలీవుడ్ సంస్థ దక్కించుకుందన్న విజయ్ సేతుపతి
- ప్రముఖ హాలీవుడ్ స్టార్ నటుడు మాథ్యూ మెక్‌కొనాహే నటించబోతున్నారని నిర్మాత తనకు ఫోన్ చేసి చెప్పారని వెల్లడి
- అందులో తనకు ఒక చిన్న పాత్ర ఇప్పించాలని సరదాగా అడిగానని వ్యాఖ్య
విలక్షణ నటనతో దక్షిణ భారతదేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ‘మక్కల్ సెల్వన్’ విజయ్ సేతుపతి తన రాబోయే చిత్రాలు, హాలీవుడ్ రీమేక్ ఆఫర్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దర్శకుడు నిథిలన్ స్వామినాథన్ తనకు ‘మహారాజా 2’ కథను వినిపించారని, ఆ కథ వినగానే తనకు ఎంతగానో నచ్చిందని వెల్లడించారు. ‘మహారాజా’ మొదటి భాగం విడుదల కాకముందు కొందరు అనుమానాలు వ్యక్తం చేసినప్పటికీ, తాను మాత్రం సినిమా విజయంపై గట్టి నమ్మకంతో ఉన్నానని గుర్తుచేసుకున్నారు.
అంతేకాకుండా, ‘మహారాజా’ సినిమాకు సంబంధించి ఇటీవల హాలీవుడ్ నుంచి ఒక భారీ సర్ ప్రైజ్ వచ్చిందని విజయ్ సేతుపతి తెలిపారు. ఈ సినిమా రీమేక్ హక్కులను హాలీవుడ్ సంస్థ దక్కించుకుందని, అందులో ప్రముఖ హాలీవుడ్ స్టార్ నటుడు మాథ్యూ మెక్‌కొనాహే నటించబోతున్నారని నిర్మాత తనకు ఫోన్ చేసి చెప్పినట్లు వివరించారు. ఈ వార్త విన్నవెంటనే తాను ఎంతో థ్రిల్ అయ్యానని... "ఆ హాలీవుడ్ రీమేక్‌లో నాకు ఒక చిన్న పాత్ర ఇప్పించండి. ఉచితంగా నటిస్తాను" అని నిర్మాతతో సరదాగా అన్నట్లు పంచుకున్నారు. మొదటి నుంచి హాలీవుడ్‌లో నటించాలనే కోరిక ఉందని, తన చిత్రం అక్కడ రీమేక్ కావడం ఎంతో గర్వంగా ఉందని చెప్పారు.