రవితేజ 'ఇరుముడి'.. స్క్రీన్ల ముందు అభిమానుల భక్తి పారవశ్యం.. థియేటర్లలో కర్పూర హారతులు!

Ravi Teja Irumudi movie fans celebrate with camphor haratis in theaters
  • నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవితేజ 'ఇరుముడి'
  • తొలి షో నుంచే సినిమాకు పాజిటివ్ టాక్
  • అయ్యప్ప మాలలో రవితేజను చూసి భక్తితో ఊగిపోతున్న ఫ్యాన్స్
  • థియేటర్లలో స్క్రీన్లకు కర్పూర హారతులు పడుతున్న అరుదైన దృశ్యాలు
  • 'మల్లెపూల పల్లకి' పాటకు థియేటర్లలో డ్యాన్సులతో హోరెత్తిస్తున్న ప్రేక్షకులు
మాస్ మహారాజా రవితేజ, సెన్సిబుల్ డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న 'ఇరుముడి' చిత్రం నేడు (ఆగస్టు 21) ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ డివోషనల్ ఫ్యామిలీ థ్రిల్లర్, తొలి షో నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. దీంతో థియేటర్ల వద్ద అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి. సినిమా చూసిన ప్రేక్షకులు ఒక గొప్ప భావోద్వేగ ప్రయాణాన్ని అనుభవిస్తున్నామని చెబుతున్నారు.

ఈ సినిమా విషయంలో అభిమానులు సరికొత్త ట్రెండ్‌ను సృష్టిస్తున్నారు. ముఖ్యంగా అయ్యప్ప స్వామి మాలధారణలో రవితేజ వెండితెరపై కనిపించిన ప్రతిసారీ థియేటర్లు 'స్వామియే శరణం అయ్యప్ప' అనే నామస్మరణతో మార్మోగిపోతున్నాయి. చాలా చోట్ల అభిమానులు భక్తి పారవశ్యంతో స్క్రీన్ల వద్దకు వెళ్లి నేరుగా కర్పూర హారతులు పడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. ఒక కమర్షియల్ హీరో సినిమాకు ఇలాంటి భక్తిపూర్వక స్పందన రావడం ఇదే తొలిసారని విశ్లేషకులు అంటున్నారు.

ఇక, సినిమాలో ఎంతో ప్రాధాన్యత ఉన్న 'మల్లెపూల పల్లకి' పాట, దాని తర్వాత వచ్చే యాక్షన్ సన్నివేశాల సమయంలో థియేటర్లలో ప్రేక్షకులు పూనకం వచ్చినట్లు ఊగిపోతున్నారు. స్క్రీన్ల ముందే డ్యాన్సులు చేస్తూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన విజువల్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. రవితేజ మాస్ ఎనర్జీకి శివ నిర్వాణ మార్క్ ఎమోషన్స్ తోడవడంతో 'ఇరుముడి' అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. మొత్తంగా కేవలం ఒక సినిమాగానే కాకుండా థియేటర్లలో ఒక పండుగ వాతావరణాన్ని, భక్తిమ‌య‌మైన అనుభూతిని సృష్టించిన 'ఇరుముడి' బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించడం ఖాయంగా కనిపిస్తోంది.
Advertisement
Ravi Teja
Irumudi Movie
Shiva Nirvana
Mythri Movie Makers
Irumudi Public Review
Ayyappa Swamy Devotional Film

More Telugu News