కుకూ ఎలక్ట్రానిక్స్‌తో లోకేశ్ భేటీ.. ఏపీలో యూనిట్ ఏర్పాటుకు ఆహ్వానం

  • దక్షిణ కొరియా పర్యటనలో మంత్రి నారా లోకేశ్ 
  • హోం అప్లయెన్సెస్ యూనిట్ ఏర్పాటుపై కుకూ ఎలక్ట్రానిక్స్‌తో చర్చలు
  • ఏపీలో ఉన్న వ్యాపార అవకాశాలను కంపెనీకి వివరించిన లోకేశ్ 
  • ఈవీ, రక్షణ రంగాల్లో పెట్టుబడుల కోసం మరో సంస్థతో సమావేశం
ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి నారా లోకేశ్ దక్షిణ కొరియా పర్యటన కొనసాగుతోంది. పర్యటనలో భాగంగా ఆరో రోజు ఆయన ప్రముఖ గృహోపకరణాల సంస్థ 'కుకూ ఎలక్ట్రానిక్స్' సీనియర్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో గృహోపకరణాల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఈ సందర్భంగా వారిని కోరారు.

ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. శ్రీసిటీలో ఇప్పటికే విజయవంతంగా కొనసాగుతున్న గృహోపకరణాల క్లస్టర్‌ గురించి వివరించారు. దేశంలో తయారవుతున్న ఏసీలలో 40 శాతం, టెలివిజన్లలో 35 శాతం ఆంధ్రప్రదేశ్ నుంచే ఉత్పత్తి అవుతున్నాయని ఆయన గుర్తుచేశారు. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన మానవ వనరులు, మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ముఖ్యంగా ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్య దేశాలకు ఎగుమతులు చేసేందుకు ఏపీ అత్యంత అనువైన ప్రాంతమని పేర్కొన్నారు. మంత్రి ప్రతిపాదనల పట్ల కుకూ ప్రతినిధులు సానుకూలంగా స్పందిస్తూ, వీటిని తప్పకుండా పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

అనంతరం, లోకేశ్ మరో ఆటోమోటివ్ పవర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ సీఈఓతో విడిగా సమావేశమయ్యారు. శ్రీసిటీలో 'మోటివ్ లింక్' ప్రాజెక్టును ఏర్పాటు చేయాలని వారిని కోరారు. ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) విడిభాగాలు, ఇంటిగ్రేటెడ్ మాడ్యూల్స్ తయారీలో పెట్టుబడులు పెట్టాల్సిందిగా ఆహ్వానించారు. పరిశ్రమలకు అవసరమైన విద్యుత్, నీరు, లాజిస్టిక్స్ వంటి అన్ని సౌకర్యాలు రాష్ట్రంలో సిద్ధంగా ఉన్నాయని వివరించారు. ఈ భేటీలో రక్షణ రంగ పరికరాల తయారీలో సహకారంపైనా సుదీర్ఘంగా చర్చించారు.                                

Nara Lokesh
Cuckoo Electronics
Andhra Pradesh Investment
South Korea Visit
Sri City Home Appliances
EV Manufacturing AP

More Telugu News