చైనాలో ఘోర అగ్నిప్రమాదం.. షూ ఫ్యాక్టరీలో 28 మంది సజీవ దహనం

  • చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో ఘోర అగ్నిప్రమాదం
  • షూ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటల్లో 28 మంది కార్మికులు మృతి
  • మంటల్లో మరికొందరు చిక్కుకున్నట్లు అనుమానం
  • ఘటనపై విచారణకు ఆదేశించిన అధ్యక్షుడు జీ జిన్‌పింగ్
చైనాలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఆగ్నేయ చైనాలోని ఫుజియాన్ ప్రావిన్స్‌లో గల ఒక షూ ఫ్యాక్టరీలో గురువారం భారీ మంటలు చెలరేగడంతో 28 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. భవనంలో మరికొందరు చిక్కుకుని ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం అక్కడ సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.

షూ రాజధానిగా పిలిచే జిన్‌జియాంగ్ నగరంలోని హుయిటెంగ్ షూస్ ఫ్యాక్టరీలో ఈ విషాదం చోటుచేసుకుంది. బహుళ అంతస్తుల భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో పరిసర ప్రాంతమంతా దట్టమైన నల్లటి పొగలు అలుముకున్నాయి. భవనం పైకప్పుపై చిక్కుకున్న కొందరు కార్మికులు ప్రాణరక్షణ కోసం ఆర్తనాదాలు చేస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సమాచారం అందుకున్న వెంటనే సుమారు 200 మంది అగ్నిమాపక సిబ్బంది 35 అగ్నిమాపక యంత్రాలతో ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.

షూ తయారీలో వినియోగించే మండే స్వభావం కలిగిన ముడి పదార్థాల వల్లే మంటలు వేగంగా వ్యాపించినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ దుర్ఘటనపై చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇదొక భారీ ప్రాణ నష్టమని ఆవేదన వ్యక్తం చేస్తూ, సహాయక చర్యలను వేగవంతం చేయాలని, బాధితుల కుటుంబాలకు అండగా నిలవాలని అధికారులను ఆదేశించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు.

China
China shoe factory fire
Jinjiang factory accident
Fujian province
Xi Jinping
Huiteng Shoes Factory

More Telugu News