131 మంది కళాకారులు.. 256 గంటల పని.. గౌరీ స్ప్రాట్‌ పెళ్లి ఉంగరం వెనుక ఇంత కథ ఉందా!

  • కుటుంబ సభ్యుల మధ్య గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకున్న ఆమిర్ ఖాన్
  • వేడుకలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గౌరీ ధరించిన రూబీ వెడ్డింగ్ రింగ్ 
  • మడగాస్కర్ నుంచి తెప్పించిన అరుదైన రూబీ(కెంపు)తో ఈ ఉంగరం తయారీ
  • కెంపును సేకరించడానికే మూడు నెలలకు పైగా సమయం పట్టిన వైనం
  • 256 గంటల పాటు 131 మంది కళాకారుల వ‌ర్క్‌తో రూపుదిద్దుకున్న ఉంగ‌రం
బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్‌ను మూడో వివాహం చేసుకున్న విష‌యం తెలిసిందే. ఈ నెల‌ 5న బాంద్రాలోని ఆయన నివాసంలో ఈ వేడుక అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా జరిగింది. ఈ ప్రత్యేక సందర్భంలో వధూవరులిద్దరూ సంప్రదాయబద్ధమైన దుస్తుల్లో మెరిసిపోయారు. అయితే, పెళ్లి వేడుక కంటే ఎక్కువగా ఇప్పుడు గౌరీ వేలికి ఉన్న ఉంగరం గురించే చర్చ జరుగుతోంది.

ఈ వివాహ వేడుకలో గౌరీ ధరించిన రూబీ (కెంపు) ఉంగరం అందరి దృష్టిని ఆకర్షించింది. అరుదైన రత్నంతో, అద్భుతమైన నగిషీలతో దీన్ని తీర్చిదిద్దారు. ప్రముఖ లగ్జరీ జ్యువెలరీ బ్రాండ్ 'క్వీన్' (QWEEN) ఈ ఉంగరాన్ని ప్రత్యేకంగా డిజైన్ చేసింది. అత్యంత అరుదైన మడగాస్కర్ కెంపును ఈ ఉంగరం మధ్యలో అమర్చారు. ఈ ఉంగరం తయారీ వెనుక ఉన్న ఆసక్తికర విషయాలను 'క్వీన్' సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అమిత్ కుమార్ 'హిందుస్థాన్ టైమ్స్‌'తో పంచుకున్నారు.

"ఈ ఉంగరంలో వాడిన మడగాస్కర్ కెంపు అత్యంత అరుదైనది. పది లక్షల్లో ఒకటి మాత్రమే ఇలాంటిది దొరుకుతుంది. దీన్ని సేకరించడానికే మాకు మూడు నెలలకు పైగా సమయం పట్టింది. ఆ తర్వాత 131 మంది నైపుణ్యం గల కళాకారులు సుమారు 256 గంటల పాటు శ్రమించి దీన్ని పూర్తి చేశారు. ఈ ఉంగరం చూడ్డానికి అచ్చం రాజకుటుంబీకుల ఆభరణంలా కనిపించాలనే ఉద్దేశంతో డిజైన్ చేశాం" అని అమిత్ కుమార్ వివరించారు.

ఉంగరం డిజైన్ ఎందుకంత ప్రత్యేకం?
సాధారణ ఉంగరాల్లా కాకుండా దీన్ని ప్రత్యేకంగా డిజైన్ చేశారు. కెంపును నేరుగా బ్యాండ్‌పై కాకుండా, కిరీటం ఆకారంలో ఉన్న బంగారు నిర్మాణం మధ్యలో అమర్చారు. కెంపుకు సాధారణ కోతలకు బదులుగా నునుపుగా, గుండ్రంగా ఉండే 'కబోకాన్ కట్' ను ఉపయోగించారు. దీనివల్ల రత్నం రంగు మరింత స్పష్టంగా కనిపిస్తూ ప్రత్యేకమైన మెరుపును సంతరించుకుంది.

ఉంగరం డిజైనింగ్ గురించి అమిత్ కుమార్ మరింత వివరిస్తూ.. "కిరీటం ఆకారంలోని పాయింట్ల మధ్య కెంపును అమర్చాం. దీని చుట్టూ చారిత్రక రాజవంశీయుల, పట్టాభిషేక ఆభరణాలలో ఉపయోగించే 'మిల్‌గ్రెయిన్ బీడింగ్' అనే క్లిష్టమైన డిజైన్‌ను జోడించాం. ఇది కేవలం ఒక పెళ్లి ఉంగరం కాదు, తరతరాలుగా వారసత్వంగా అందించుకునే 'కూచర్ హీర్లూమ్' ఆభరణంగా దీన్ని తీర్చిదిద్దాం" అని తెలిపారు. అరుదైన మడగాస్కర్ కెంపు, వజ్రాల అలంకరణ, అద్భుతమైన కళానైపుణ్యం ఈ ఉంగరాన్ని ఒక ప్రత్యేకమైన కళాఖండంగా నిలబెట్టాయి.

Gauri Spratt
Aamir Khan
Madagascar Ruby
QWEEN Jewelry
Wedding Ring
Amit Kumar

More Telugu News