గగన్‌యాన్‌ దిశగా మరో ముందడుగు.. పారాచూట్ల పరీక్ష విజయవంతం

  • గగన్‌యాన్‌ కోసం పారాచూట్‌ పరీక్ష విజయవంతం
  • క్రూ క్యాప్సూల్‌ను సురక్షితంగా దించే కీలక వ్యవస్థ
  • 10 పారాచూట్లతో పనిచేసే డీసిలరేషన్‌ సిస్టమ్‌
  • ఐఎల్‌-76 విమానం నుంచి 2.5 కి.మీ. ఎత్తులో పరీక్ష
  • ఇస్రో, డీఆర్‌డీవో, వైమానిక దళం, సైన్యం సంయుక్తంగా పరీక్ష నిర్వహణ
భారత తొలి మానవ అంతరిక్ష యాత్ర గగన్‌యాన్‌ మిషన్‌లో మరో కీలక ఘట్టం పూర్తైంది. వ్యోమగాములు ప్రయాణించే క్రూ క్యాప్సూల్‌ను అంతరిక్షం నుంచి సురక్షితంగా భూమిపైకి తీసుకొచ్చేందుకు అవసరమైన ప్రధాన పారాచూట్‌ వ్యవస్థను ఇస్రో విజయవంతంగా పరీక్షించింది. దీంతో గగన్‌యాన్‌ మిషన్‌ మరో అడుగు ముందుకు వేసింది.

మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో ఉన్న ఏరియల్‌ డెలివరీ రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ డ్రాప్‌ జోన్‌లో ఈ పరీక్ష నిర్వహించారు. దీనిని ‘ఇంటిగ్రేటెడ్‌ మెయిన్‌ పారాచూట్‌ ఎయిర్‌డ్రాప్‌ టెస్ట్‌ (IMAT-05)’గా ఇస్రో పేర్కొంది. అంతరిక్షం నుంచి భూవాతావరణంలోకి ప్రవేశించిన తర్వాత క్రూ క్యాప్సూల్‌ వేగాన్ని తగ్గించి సముద్రంలో సురక్షితంగా దిగేలా చేయడంలో ఈ పారాచూట్లు కీలక పాత్ర పోషిస్తాయి.

గగన్‌యాన్‌ క్రూ మాడ్యూల్‌లో మొత్తం 10 పారాచూట్లు ఉంటాయి. ఇవి నాలుగు రకాలుగా పనిచేస్తాయి. మొదట రెండు అపెక్స్‌ కవర్‌ సెపరేషన్‌ పారాచూట్లు రక్షణ కవర్‌ను తొలగిస్తాయి. తర్వాత రెండు డ్రోగ్‌ పారాచూట్లు క్యాప్సూల్‌ను స్థిరపరిచి వేగాన్ని తగ్గిస్తాయి. ఆ తర్వాత మూడు పైలట్‌ పారాచూట్లు పనిచేసి మూడు ప్రధాన పారాచూట్లను తెరుస్తాయి. చివరగా ఈ ప్రధాన పారాచూట్లు క్యాప్సూల్‌ వేగాన్ని భారీగా తగ్గించి సముద్రంలో సురక్షితంగా దిగేలా చేస్తాయి. అనంతరం రికవరీ బృందాలు వ్యోమగాములను బయటకు తీసుకొస్తాయి.

తాజా పరీక్షలో భారత వైమానిక దళానికి చెందిన ఐఎల్‌-76 విమానం నుంచి 2.5 కిలోమీటర్ల ఎత్తు నుంచి డమ్మీ బరువుతో కూడిన ప్రధాన పారాచూట్‌ వ్యవస్థను వదిలారు. ముందుగా ఎక్స్‌ట్రాక్టర్‌ పారాచూట్‌, ఆ తర్వాత డ్రోగ్‌ పారాచూట్‌ పనిచేశాయి. అవసరమైన పరిస్థితులు ఏర్పడిన తర్వాత ప్రధాన పారాచూట్‌ విజయవంతంగా తెరుచుకుని డమ్మీ బరువు వేగాన్ని సురక్షిత స్థాయికి తగ్గించింది.

గగన్‌యాన్‌ తొలి మానవరహిత ప్రయోగం జీ1 మిషన్‌లో ఎదురయ్యే అత్యధిక ఒత్తిడి పరిస్థితుల్లో కూడా ప్రధాన పారాచూట్‌ సమర్థంగా పనిచేస్తుందో లేదో నిర్ధారించడమే ఈ పరీక్ష లక్ష్యమని ఇస్రో తెలిపింది. ఈ పరీక్ష విజయవంతం కావడంతో పారాచూట్‌ వ్యవస్థ పనితీరుపై మరింత విశ్వాసం పెరిగిందని వెల్లడించింది.

ఇస్రో, డీఆర్‌డీవో, భారత వైమానిక దళం, భారత సైన్యం సంయుక్తంగా ఈ పరీక్ష నిర్వహించాయి. గగన్‌యాన్‌ తొలి మానవరహిత ప్రయోగానికి ముందు కీలక వ్యవస్థలను ధ్రువీకరించే ప్రక్రియలో ఈ పరీక్షకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

ISRO
Gaganyaan Mission
Parachute System Test
Crew Module Landing
Indian Space Research Organisation
IMAT 05 Test

More Telugu News