నీట్ రీ-ఎగ్జామ్ ఫలితాలపై ఎన్‌టీఏ కీలక అప్‌డేట్‌

  • నీట్ రీ-ఎగ్జామ్ ఫలితాలు జులై 20లోపు విడుదల
  • ప్రొవిజనల్ ఆన్సర్ కీపై 10 వేల అభ్యంతరాలు
  • అభ్యంతరాల పరిశీలన తర్వాత తుది ఫలితాల ప్రకటన
  • ఎంబీబీఎస్ విద్యా సంవత్సరం ఆలస్యం కాదని ఎన్‌టీఏ స్పష్టీకరణ
నీట్-యూజీ రీ-ఎగ్జామ్ ఫలితాలను జులై 20లోపు ప్రకటిస్తామని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. ప్రశ్నాపత్రం లీక్ ఆరోపణలతో మే 3న నిర్వహించిన పరీక్షను రద్దు చేసిన తర్వాత జూన్ 21న మళ్లీ పరీక్ష నిర్వహించారు. ఫలితాల విడుదల కోసం వేగంగా ప్రక్రియ కొనసాగుతోందని ఎన్‌టీఏ సీనియర్ అధికారి తెలిపారు. అయితే ఫలితాల కచ్చితమైన తేదీని ఇప్పుడే వెల్లడించలేదు. ఎంబీబీఎస్ విద్యా సంవత్సరం ఆలస్యం కాదని మాత్రం స్పష్టం చేశారు.

జూన్ 25న ప్రొవిజనల్ ఆన్సర్ కీ విడుదల చేయగా, అభ్యర్థులకు జూన్ 28 వరకు అభ్యంతరాలు తెలిపే అవకాశం ఇచ్చారు. మొత్తం సుమారు 10 వేల అభ్యంతరాలు వచ్చినట్లు ఎన్‌టీఏ తెలిపింది. ఒక్కో అభ్యంతరాన్ని విడివిడిగా పరిశీలించి, సమర్పించిన ఆధారాలను పరిశీలించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారులు పేర్కొన్నారు. ఒక్కో ప్రశ్నకు రూ.200 ఫీజు వసూలు చేస్తారని, అభ్యంతరం సరైందని తేలితే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తామని వెల్లడించారు.

ఫలితాల అనంతరం 15 శాతం ఆల్ ఇండియా కోటా, ఎయిమ్స్, జిప్‌మర్, కేంద్ర, డీమ్డ్ యూనివర్సిటీల కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (ఎంసీసీ) విడుదల చేయనుంది. రాష్ట్రాలు తమ 85 శాతం స్టేట్ కోటా కౌన్సెలింగ్‌ను విడిగా నిర్వహిస్తాయి. కౌన్సెలింగ్ పూర్తయిన వెంటనే గత ఏడాదిలాగే ఈ ఏడాది కూడా ఎంబీబీఎస్ తొలి సంవత్సరం విద్యా తరగతులు సమయానికే ప్రారంభమవుతాయని ఎన్‌టీఏ అధికారులు తెలిపారు.

National Testing Agency
NEET UG Re Exam Results
Medical Counseling Committee MCC
MBBS Admission 2024
NEET Answer Key Objections
NTA NEET Update

More Telugu News