'ఎప్పటికీ క్షమించవద్దు.. ఎప్పటికీ మర్చిపోవద్దు'.. ఎమర్జెన్సీ ఒక ఘోర పాపం: ప్రధాని మోదీ
ఎమర్జెన్సీకి 51 ఏళ్లు.. కాంగ్రెస్‌పై ప్రధాని విమర్శలు
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అని వ్యాఖ్య
ఎమర్జెన్సీ విధించిన వారిని ఎప్పటికీ క్షమించవద్దని ప్రజలకు పిలుపు
ఆనాడు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని ఆరోపణ
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తాను కూడా పోరాడానని గుర్తు చేసుకున్న మోదీ
భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎమర్జెన్సీ చీకటి అధ్యాయం అని వ్యాఖ్య
ఎమర్జెన్సీ విధించిన వారిని ఎప్పటికీ క్షమించవద్దని ప్రజలకు పిలుపు
ఆనాడు ప్రతిపక్ష నేతలను జైల్లో పెట్టారని, మీడియా గొంతు నొక్కారని ఆరోపణ
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తాను కూడా పోరాడానని గుర్తు చేసుకున్న మోదీ
ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రధాని మోదీ ఒక సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘ఎమర్జెన్సీ 51వ వార్షికోత్సవం - భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఎంతటి చీకటి అధ్యాయమో తెలుసుకోండి’ అనే శీర్షికతో ఆనాటి పరిస్థితులను వివరించారు. "ఎమర్జెన్సీ కాలంలో పౌరుల హక్కులను, మీడియా స్వేచ్ఛను దారుణంగా అణచివేశారు. ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టు చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పిన వారిని, రాజకీయ అసమ్మతి తెలిపిన వారిని తీవ్రంగా అణచివేశారు. రచయితలు, జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, విద్యార్థులతో పాటు సామాన్య పౌరులను కూడా జైళ్లలో పెట్టి చిత్రహింసలకు గురిచేశారు" అని మోదీ ఆరోపించారు.
ఆనాడు రాజ్యాంగాన్ని కాలరాశారని, న్యాయవ్యవస్థను రాజకీయ నియంత్రణలోకి తెచ్చేందుకు నీచమైన ప్రయత్నాలు జరిగాయని మోదీ విమర్శించారు. "మీడియాపై తీవ్రమైన ఆంక్షలు విధించారు. ప్రభుత్వ ఆదేశాలను పాటించని వారిని బెదిరించారు లేదా పత్రికలను మూసివేశారు. ప్రాథమిక హక్కులను సస్పెండ్ చేశారు. పౌరులను రక్షించాల్సిన ప్రతి వ్యవస్థ వారికే వ్యతిరేకంగా మారింది. పార్లమెంటును కేవలం ఒక 'రబ్బరు స్టాంపు'గా మార్చేశారు" అని ఆయన పేర్కొన్నారు.
అంతటి నిర్బంధం మధ్య కూడా ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఎందరో పోరాడారని మోదీ గుర్తుచేశారు. "వివిధ నేపథ్యాలు, సిద్ధాంతాలకు చెందిన ప్రజలందరూ ఏకమై ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగ విలువలను కాపాడేందుకు ముందుకు వచ్చారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఆ ఉద్యమంలో పాలుపంచుకునే గౌరవం నాకు కూడా దక్కింది" అని ఆయన తెలిపారు.
ప్రజల పోరాట స్ఫూర్తి (జనశక్తి) ముందు నాటి కాంగ్రెస్ ప్రభుత్వం తలవంచక తప్పలేదని, చివరికి ఎమర్జెన్సీని ఎత్తివేసి ఎన్నికలు నిర్వహించగా, దానిని విధించిన వారు ఘోరంగా ఓడిపోయారని వివరించారు. "ఎమర్జెన్సీ అనే ఘోర పాపం దానిని విధించిన వారి నుదుట శాశ్వతంగా నిలిచిపోతుంది. ఆనాడు ప్రజాస్వామ్యం కోసం దృఢంగా నిలబడిన ప్రతి ఒక్కరికీ ఈరోజు మనం వందనం చేస్తున్నాం. వారి వల్లే ప్రజాస్వామ్యం బతికింది" అని మోదీ పేర్కొన్నారు.