వెనిజులా భూకంపానికి ముందే హెచ్చరించిన గూగుల్.. ఎలా సాధ్యమైంది?

  • వెనిజులా భూకంపానికి ముందే గూగుల్ అలర్ట్‌లు
  • ప్రకంపనలను ముందే గుర్తించే స్మార్ట్‌ఫోన్‌లలోని యాక్సిలరోమీటర్
  • లక్షలాది ఫోన్ల నుంచి వచ్చే సమాచారాన్ని గూగుల్ విశ్లేషణ
  • పీ-వేవ్స్ ఆధారంగా ముందస్తు హెచ్చరికల జారీ
  • భారత్‌లో 2023 నుంచే అందుబాటులో ఉన్న ఈ సేవ
వెనిజులాలో వరుసగా సంభవించిన భారీ భూకంపాలు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. రిక్టర్‌ స్కేల్‌పై 7.1, 7.5 తీవ్రతతో నమోదైన ఈ ప్రకంపనల వల్ల అనేక భవనాలు దెబ్బతిన్నాయి. అయితే భూకంపం రాకముందే కొందరు తమ ఆండ్రాయిడ్ ఫోన్లలో గూగుల్ నుంచి హెచ్చరికలు అందుకున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించారు. దీంతో ‘భూకంపం రాకముందే గూగుల్‌కు ఎలా తెలుస్తుంది?’ అనే ప్రశ్న ఆసక్తిని రేకెత్తిస్తోంది.

మీ స్మార్ట్‌ఫోనే భూకంప సెన్సర్‌
ప్రతి ఆధునిక స్మార్ట్‌ఫోన్‌లో ‘యాక్సిలరోమీటర్’ అనే సెన్సర్ ఉంటుంది. సాధారణంగా ఫోన్‌ను తిప్పినప్పుడు స్క్రీన్ ఆటోమేటిక్‌గా తిరగడానికి ఇదే కారణం. కానీ ఇదే సెన్సర్ భూమిలో వచ్చే చిన్న కంపనాలను కూడా గుర్తించగలదు.

భూకంపానికి సంబంధించిన ప్రకంపనలను ఫోన్ గుర్తించిన వెంటనే, ఆ సమాచారం ఫోన్ ఉన్న ప్రాంత వివరాలతో కలిపి గూగుల్‌ ‘ఆండ్రాయిడ్‌ ఎర్త్‌క్వేక్‌ అలర్ట్స్‌ సిస్టమ్‌’కు చేరుతుంది. ఒకే ప్రాంతంలో ఉన్న అనేక ఫోన్లు ఒకే సమయంలో ఇలాంటి కంపనాలను నమోదు చేస్తే, అక్కడ భూకంపం సంభవిస్తున్నట్లు గూగుల్ సిస్టమ్ నిర్ధారిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా ఆండ్రాయిడ్ ఫోన్లు ఈ నెట్‌వర్క్‌లో భాగంగా ఉన్నాయి.  దీంతో ఇది ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ ‘భూకంప గుర్తింపు వ్యవస్థ’గా మారింది.

ముందే అలర్ట్ ఎలా?
భూకంపం ఒక్కసారిగా సంభవించదు. అది తరంగాల రూపంలో వ్యాపిస్తుంది. ‘పీ-వేవ్స్’ అనే ప్రాథమిక కంపనాలు తొలుత అత్యంత వేగంగా ప్రయాణిస్తాయి. కానీ ప్రభావం తక్కువగా ఉంటుంది. తర్వాత ఎక్కువ నష్టం కలిగించే ‘ఎస్-వేవ్స్’ అనే కంపనాలు వ్యాపిస్తాయి. అయితే పీ-వేవ్స్ కంటే నెమ్మదిగా ప్రయాణిస్తాయి.

ముందుగా వచ్చే పీ-వేవ్స్‌ను ఫోన్లు గుర్తించి గూగుల్ సర్వర్లకు సమాచారం పంపిస్తాయి. ఈ డేటాను విశ్లేషించిన గూగుల్, ఎస్-వేవ్స్ చేరుకునేలోపే వినియోగదారులకు హెచ్చరికలు పంపగలుగుతుంది. సరళంగా చెప్పాలంటే... భూకంప తరంగాల కంటే ఇంటర్నెట్ ద్వారా సమాచారం కాంతి వేగానికి సమీపంగా ప్రయాణిస్తుంది. అందుకే కొన్ని సెకన్ల ముందే అలర్ట్ అందుతుంది.

రెండు రకాల హెచ్చరికలు
ఆండ్రాయిడ్‌లో భూకంపాల కోసం రెండు రకాల అలర్ట్‌లు ఉంటాయి. ‘బీ అవేర్‌ అలర్ట్‌’- తేలికపాటి ప్రకంపనలు సంభవించే అవకాశం ఉన్నప్పుడు ఈ హెచ్చరిక వస్తుంది. ‘టేక్‌ యాక్షన్‌ అలర్ట్‌’-మోస్తరు లేదా తీవ్రమైన భూకంపం వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఈ అలర్ట్ కనిపిస్తుంది. వెంటనే సురక్షిత ప్రాంతానికి వెళ్లేందుకు ఇది ఉపయోగపడుతుంది.
అలర్ట్‌పై క్లిక్ చేస్తే భూకంపం కేంద్రం, తీవ్రత, భద్రతా సూచనలు, మ్యాప్ వంటి వివరాలు కూడా కనిపిస్తాయి.

భారత్‌లోనూ ఉంది
ఆండ్రాయిడ్ ‘ఎర్త్‌క్వేక్‌ అలర్ట్స్‌ సిస్టమ్‌’ భారత్‌లో 2023 నుంచే పనిచేస్తోంది. ఆండ్రాయిడ్‌ 5 లేదా అంతకంటే కొత్త వెర్షన్ ఉన్న ఫోన్లలో ఈ సదుపాయం అందుబాటులో ఉంటుంది. అయితే అలర్ట్‌లు అందుకోవాలంటే మొబైల్ డేటా లేదా వై-ఫై కనెక్షన్ తప్పనిసరి.

Google
Venezuela earthquake
Android earthquake alerts system
Smartphone earthquake sensor
Earthquake early warning technology
Google earthquake alerts India

More Telugu News