పెళ్లికి కోహ్లీ, రోహిత్, ధోనీలను పిలవలేదా?.. పేసర్ ఆకాశ్ దీప్ ఫన్నీ సమాధానం!
- వారణాసిలో ప్రేయసి అక్షిత రాజ్‌ను వివాహం చేసుకున్న ఆకాశ్ దీప్
- పెళ్లికి కోహ్లీ, ధోనీలను ఎందుకు పిలవలేదని ప్రశ్నించిన బంధువు
- వాళ్లు వస్తే పెళ్లి జరగదంటూ సరదాగా సమాధానమిచ్చిన పేసర్
- గాయం కారణంగా ఐపీఎల్ 2026 సీజన్‌కు, టీమిండియాకు దూరమైన ఆకాశ్
- గతంలో ఇంగ్లండ్‌పై ఒకే టెస్టులో 12 వికెట్లు పడగొట్టి సత్తా చాటిన బౌలర్
వివాహ వేడుకలో ఓ బంధువు ఆకాశ్ దీప్‌ను.. "సోదరా, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మలను మీ పెళ్లికి పిలవలేదా?" అని ప్రశ్నించారు. దీనికి ఆకాశ్ దీప్ నవ్వుతూ.. "వాళ్లు గనక వస్తే అసలు ఇక్కడ బనారస్‌లో పెళ్లి జరుగుతుందా?" అని చమత్కారంగా బదులిచ్చాడు. దేశంలో ఆ ముగ్గురు స్టార్ క్రికెటర్లకు ఉన్న అపారమైన క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వారు హాజరైతే అభిమానుల తాకిడితో పెళ్లి వేడుక నిర్వహించడం కష్టంగా మారుతుందనే ఉద్దేశంతో ఆకాశ్ ఈ విధంగా సమాధానమిచ్చాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
కెరీర్ విషయానికొస్తే.. ఆకాశ్ దీప్ భారత్ తరఫున 10 టెస్టు మ్యాచ్‌లు ఆడి 28 వికెట్లు పడగొట్టాడు. గత ఏడాది ఇంగ్లండ్‌తో బర్మింగ్‌హామ్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఏకంగా 12 వికెట్లు పడగొట్టి తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. అతని ప్రతిభను గుర్తించిన కోల్‌కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) ఐపీఎల్ 2026 సీజన్ కోసం కొనుగోలు చేసింది.
అయితే, వెన్నునొప్పి గాయం కారణంగా ఆకాశ్ దీప్ ఈ సీజన్‌కు పూర్తిగా దూరమయ్యాడు. ఇదే గాయం అతడిని భారత టెస్టు జట్టుకు కూడా దూరం పెట్టింది. ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న ఆకాశ్ దీప్ విశ్రాంతి తీసుకుంటుండగా, ఇటీవలే భారత జట్టు శుభ్‌మన్ గిల్ సారథ్యంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన ఏకైక టెస్టులో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ పేస్ దళానికి నాయకత్వం వహించారు.