నేపాల్ మొక్కలకు కాస్తున్న జపాన్ కరెన్సీ నోట్లు!
- నేపాల్ నుంచి జపాన్ కరెన్సీకి ముడిసరుకు
- హిమాలయ శ్రేణుల్లో ‘మిత్సుమాత’ మొక్క సాగు
- జపాన్‌లో తగ్గిన రైతుల సంఖ్య
- ప్రత్యామ్నాయంగా నేపాల్‌ను ఎంచుకున్న జపాన్
- 30 నుంచి 100 టన్నులకుపైగా పెరిగిన వార్షిక ఉత్పత్తి
- ఈ ప్రాజెక్ట్ ద్వారా నేపాల్ గ్రామీణ మహిళలకు ఉపాధి
"డబ్బులు ఏమైనా చెట్లకు కాస్తాయా?" అని మన పెద్దలు తరచూ అంటుంటారు. కానీ, జపాన్ దేశానికి సంబంధించినంత వరకు ఇది అక్షరాలా నిజం! జపాన్ ప్రజల జేబుల్లో మెరిసే సరికొత్త 'యెన్' కరెన్సీ నోట్లు.. జపాన్‌కు దాదాపు 5,200 కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపాల్ హిమాలయ పర్వత లోయల్లో మొలిచే మొక్కల నుండి తయారవుతున్నాయి. రెండు దేశాల మధ్య దశాబ్దాలుగా సాగుతున్న అంతర్జాతీయ ద్వైపాక్షిక సహకారానికి ఈ వినూత్న ప్రాజెక్ట్ ఒక అద్భుత నిదర్శనంగా నిలిచింది.
జపాన్‌లో 'మిత్సుమాతా'అని, నేపాల్ స్థానిక భాషలో 'అర్గేలి' అని పిలిచే ఈ పొద తరహా మొక్క (శాస్త్రీయ నామం: Edgeworthia chrysantha) జపాన్ కరెన్సీ నోట్ల తయారీకి అత్యంత కీలకమైనది. దీని కొమ్మల నుండి తీసే నార చాలా బలంగా, మృదువుగా, మన్నికగా ఉంటుంది. జపాన్‌లో మెయిజీ కాలం నుంచే సంప్రదాయ 'వాషి' పేపర్, నోట్ల తయారీకి దీనిని వాడుతున్నారు. అయితే, జపాన్‌లో గ్రామీణ జనాభా తగ్గడం, ఉన్న రైతులు వృద్ధులు కావడంతో దేశీయంగా దీని ఉత్పత్తి గణనీయంగా పడిపోయింది. ఈ తరుణంలో ఈ మొక్క సహజసిద్ధంగా పెరిగే నేపాల్ హిమాలయ ప్రాంతాలు జపాన్ ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా మారాయి.
1990లోనే పునాది
ఓసాకాకు చెందిన 'కాన్పూ ఇంక్' అనే సంస్థ జపాన్ ఆర్థిక శాఖ ఇచ్చిన సమాచారంతో 1990లోనే నేపాల్‌లోని 'జిరి' ప్రాంతంలో పరిశోధనలు ప్రారంభించింది. నేపాల్ కొండల్లో సహజంగా పెరుగుతున్న ఈ మొక్క నాణ్యతను గుర్తించి, స్థానిక ప్రజలకు దీనిని శాస్త్రీయ పద్ధతిలో సాగు చేయడం, ప్రాసెస్ చేయడంలో శిక్షణ ఇచ్చింది. "నేపాల్‌లో పండే మిత్సుమాతా ప్రపంచంలోనే అత్యుత్తమ నాణ్యత కలిగినది" అని కాన్పూ సంస్థ ప్రెసిడెంట్ తాదాషి మత్సుబారా తెలిపారు.
మహిళా సాధికారత.. మారిన గ్రామీణ రూపురేఖలు
ఈ మొక్క కొమ్మలను సేకరించి, ఆవిరిపై ఉడికించి, పై బెరడును జాగ్రత్తగా వలిచి, కడిగి ఎండబెట్టడం వంటి పనులకు భారీ శారీరక శ్రమ లేదా ప్రత్యేక సాంకేతిక నైపుణ్యాలు అవసరం లేదు. దీనివల్ల నేపాల్‌లోని గ్రామీణ మహిళలు తమ ఇంటి పనులను చేసుకుంటూనే ఈ ఉపాధిలో భాగస్వాములవుతున్నారు. ఈ సాగు ద్వారా వచ్చే ఆదాయం అక్కడ పేద కుటుంబాల పిల్లల చదువులకు, మారుమూల గ్రామాల అభివృద్ధికి తోడ్పడుతోంది. ఉపాధి కోసం యువత విదేశాలకు వలస వెళ్లే పరిస్థితి కూడా దీనివల్ల తగ్గింది.
జికా అండతో పెరిగిన ఉత్పత్తి
2016లో ఈ ప్రాజెక్టుకు ‘జపాన్ అంతర్జాతీయ సహకార సంస్థ’ (జికా) మద్దతు లభించడంతో ఒక పెద్ద మలుపు తిరిగింది. జికా సంస్థ నేపాల్ ప్రభుత్వంతో సమన్వయం చేసుకుంటూ లైసెన్సుల ప్రక్రియను సులభతరం చేసి, రైతులకు మరిన్ని శిక్షణ కార్యక్రమాలను నిర్వహించింది. దీని ఫలితంగా, ఏడాదికి కేవలం 30 టన్నులుగా ఉన్న ముడిసరుకు ఉత్పత్తి, ఇప్పుడు ఏకంగా 100 టన్నులకు పైగా పెరిగి జపాన్ ముద్రణాలయానికి నిరంతరాయంగా సరఫరా అవుతోంది. 2024 లో జపాన్ అత్యంత సురక్షితమైన హోలోగ్రామ్ ఫీచర్లతో విడుదల చేసిన కొత్త సిరీస్ నోట్లకు కూడా నేపాల్ మిత్సుమాతానే వాడారు.
త్వరలోనే జపాన్ - నేపాల్ దౌత్య సంబంధాల 70వ వార్షికోత్సవం జరగనున్న నేపథ్యంలో ఒక దేశ సాంకేతికత.. మరో దేశ సహజ వనరులు కలిసి రెండు దేశాలకూ ఎలా పరస్పర ప్రయోజనాన్ని చేకూర్చవచ్చో చెప్పడానికి ఈ 'నోట్ల మొక్కల' ప్రాజెక్ట్ ఒక చక్కని ఉదాహరణ.