పాస్‌పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు: కేంద్రం సంచలన ప్రకటన

Indian Passport is not proof of citizenship Center sensational announcement
  • పౌరసత్వానికి అది కచ్చితమైన రుజువు కాదన్న విదేశాంగ శాఖ
  • ఇది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉద్దేశించిన పత్రం మాత్రమేనని స్పష్టీకరణ
  • పౌరసత్వ చట్టం ప్రకారమే ఈ వ్యాఖ్యలు చేసినట్లు ప్రభుత్వ వర్గాల వెల్లడి
  • కేంద్రం ప్రకటనపై సోషల్ మీడియాలో విస్తృత చర్చ 
  • ఆధార్, ఓటర్ ఐడీ కూడా పౌరసత్వానికి రుజువులు కావని గతంలోనే స్పష్టత
మీ దగ్గర భారతీయ పాస్‌పోర్ట్ ఉందా? అది మీ దగ్గర ఉంటే మీరు భారత పౌరులని అధికారికంగా నిరూపితమైనట్టేనని భావిస్తున్నారా? అయితే కేంద్ర ప్రభుత్వం తాజాగా ఇచ్చిన స్పష్టత మిమ్మల్ని విస్మయానికి గురిచేయక మానదు. "భారతీయ పాస్‌పోర్ట్ అనేది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ఒక ప్రయాణ పత్రం మాత్రమే కానీ, అది పౌరసత్వానికి పూర్తి స్థాయి రుజువు కాదు" అని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. 14వ పాస్‌పోర్ట్ సేవా దివస్ వేడుకల సందర్భంగా విదేశాంగ శాఖకు చెందిన ఒక సీనియర్ అధికారి ఈ వ్యాఖ్యలు చేశారు.

ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణల నేపథ్యంలో ఓటర్ లిస్ట్ నుండి తొలగించబడిన వారు తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడానికి పాస్‌పోర్ట్‌ను ఒక ఆధారంగా చూపించవచ్చా అని మీడియా అడిగిన ప్రశ్నకు అధికారి ఇలా సమాధానమిచ్చారు. సిద్ధాంతపరంగా చూస్తే పాస్‌పోర్ట్ అనేది విదేశాల్లో మీ జాతీయతను సూచిస్తుందే తప్ప, అది పౌరసత్వ పత్రం కాదని ఆయన వివరించారు.

చర్చకు దారితీసిన ప్రకటన
కేంద్రం చేసిన ఈ ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు, రాజకీయ దుమారానికి దారితీసింది. శివసేన (యూబీటీ) నేత ఆదిత్య థాకరే ఈ వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుపట్టారు. "కేంద్ర ప్రభుత్వం చెబుతున్నది విడ్డూరంగా ఉంది. పాస్‌పోర్ట్ అనేది పౌరసత్వ పత్రం కానప్పుడు, దానిని జారీ చేసే ముందు పోలీసులు ఎందుకు అన్ని వెరిఫికేషన్లు చేస్తారు? మన దేశం భారతీయులు కాని వారికి కూడా పాస్‌పోర్ట్‌లను ట్రావెల్ డాక్యుమెంట్లుగా ఇస్తుందా? ఈ ప్రకటన వల్ల విదేశాల్లో భారతీయ పాస్‌పోర్ట్ లీగాలిటీపై అనుమానాలు వచ్చే ప్రమాదం ఉంది" అని ఆయన సోషల్ మీడియా వేదికగా విమర్శించారు.

ఏ పత్రానికీ ఆ గుర్తింపు లేదు!
గతంలో సుప్రీం కోర్టుతోపాటు పలు హైకోర్టులు ఇచ్చిన తీర్పుల ప్రకారం.. భారతదేశంలో ఆధార్ కార్డ్, ఓటర్ ఐడీ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ బుక్ లేదా గ్రామ పంచాయతీ సెక్రటరీ ఇచ్చే సర్టిఫికెట్లు ఏవీ కూడా పౌరసత్వానికి తిరుగులేని ఆధారాలు కావు. ఇవన్నీ కేవలం ఒక వ్యక్తి గుర్తింపు, నివాస ధ్రువీకరణకు మాత్రమే పనికొస్తాయి. విదేశాల నుండి వచ్చి భారతదేశ పౌరసత్వం తీసుకునే వారికి మాత్రమే ప్రభుత్వం ప్రత్యేకంగా 'సిటిజన్‌షిప్ సర్టిఫికెట్' ఇస్తుంది, కానీ దేశంలో పుట్టిన వారికి అలాంటి ప్రత్యేక పత్రం ఏదీ ఉండదు.

సాంకేతిక పురోగతిని వివరించిన కేంద్రం
ఇదే సమావేశంలో విదేశాంగ శాఖ పాస్‌పోర్ట్ సేవల్లో సాధించిన మైలురాళ్లను పంచుకుంది. బయోమెట్రిక్ సమాచారంతో కూడిన, నకిలీలకు తావులేని ‘చిప్ ఆధారిత ఈ-పాస్‌పోర్ట్‌’ల జారీ ప్రక్రియ వేగవంతమైందని, ఇప్పటివరకు సుమారు 1.47 కోట్ల ఈ-పాస్‌పోర్ట్‌లను జారీ చేసినట్లు వెల్లడించింది. అలాగే గత పదేళ్లలో పాస్‌పోర్ట్ కేంద్రాల సంఖ్య 77 నుండి 545 కు పెరిగిందని, దీనివల్ల కేవలం 6 వర్కింగ్ పనిదినాల్లోనే (పోలీస్ వెరిఫికేషన్ మినహాయించి) పాస్‌పోర్ట్ డెలివరీ అవుతోందని కేంద్రం పేర్కొంది.
Go Back to Shorts
Indian Passport
Citizenship Proof
Ministry of External Affairs
Aaditya Thackeray
E Passport India
Indian Citizenship Documents

More Telugu News