'లవ్ అండ్ వార్' సెట్స్‌లో కార్మికుడి మృతి.. దర్శకుడు భన్సాలీపై ఎఫ్ఐఆర్కు డిమాండ్!
- సెట్స్‌లో విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన కార్పెంటర్
- సెట్స్‌లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఏఐసీడబ్ల్యూఏ ఆరోపణ
- బాధిత కుటుంబానికి కోటి రూపాయలు పరిహారం ఇవ్వాలని డిమాండ్
- నిబంధనల ఉల్లంఘనపై విచారణకు విజ్ఞప్తి
ముంబైలోని ఫిల్మ్ సిటీ స్టూడియోలో ఈ నెల 21న షూటింగ్ సెట్ పనులు జరుగుతుండగా, 42 ఏళ్ల యాదవ్ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా, భన్సాలీ ప్రొడక్షన్స్ మృతుడి కుటుంబానికి రూ. 40 లక్షల పరిహారం అందించేందుకు ముందుకు వచ్చినట్లు సమాచారం.
సీఎంకు లేఖ - భద్రతా లోపాలపై ఆరోపణలు
ఈ ఘటనపై ఏఐసీడబ్ల్యూఏ అధ్యక్షుడు సురేష్ శ్యామ్‌లాల్ గుప్తా.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు లేఖ రాశారు. రణబీర్ కపూర్, విక్కీ కౌశల్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా సెట్స్‌లో సరైన భద్రతా ప్రమాణాలు పాటించలేదని ఆయన ఆరోపించారు. నిర్లక్ష్యం కారణంగా జరిగిన మరణం కింద భన్సాలీ, ప్రొడక్షన్ హౌస్‌తో పాటు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.
సెట్స్‌లో భద్రతా ప్రమాణాలను తనిఖీ చేసే వరకు షూటింగ్‌ను నిలిపివేయాలని, గతంలో భన్సాలీ తీసిన 'దేవదాస్', 'పద్మావత్' సినిమాల సమయంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగాయని అసోసియేషన్ గుర్తు చేసింది. ఫెడరేషన్ ఆఫ్ వెస్ట్రన్ ఇండియా సినీ ఎంప్లాయీస్ (ఎఫ్‌డబ్ల్యూఐసీఈ) కూడా సినిమా సెట్స్‌పై కార్మికుల భద్రతను కఠినతరం చేయాలని డిమాండ్ చేసింది.
'గంగూబాయి కతియావాడి' తర్వాత భన్సాలీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం 2027 జనవరి 21న విడుదల కావాల్సి ఉంది. ఈ వివాదంపై భన్సాలీ ప్రొడక్షన్స్ నుండి ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ప్రస్తుతం పోలీసులు ఈ ప్రమాదంపై ప్రాథమిక విచారణ జరుపుతున్నారు. ఇప్పటివరకు ఎవరిపైనా ఎఫ్ఐఆర్ నమోదు కాలేదు.