వెనిజువెలాను వణికించిన జంట భూకంపాలు.. భారీగా ప్రాణనష్టం!
- నిమిషం వ్యవధిలో 7.1, 7.5 తీవ్రతతో భూకంపాలు
- రాజధాని కారకాస్, తీర ప్రాంత నగరం లా గుఐరా లో దెబ్బతిన్న భవనాలు
- అల్టామిరా పరిసరాల్లో కుప్పకూలిన నివాసాలు
- కరీబియన్ తీరానికి తొలుత సునామీ హెచ్చరికలు
- గంట తర్వాత ఉపసంహరణ
- భారీ ప్రాణనష్టం జరిగి ఉండొచ్చని ఆందోళన
యూఎస్ జియోలాజికల్ సర్వే నివేదిక ప్రకారం.. మొదట కారకాస్‌కు పశ్చిమాన 160 కిలోమీటర్ల దూరంలోని మొరోన్ సమీపంలో 7.1 తీవ్రతతో భూకంపం సంభవించగా, సరిగ్గా దాని తర్వాతి నిమిషంలోనే అదే ప్రాంతంలో 7.5 తీవ్రతతో రెండో భూకంపం కుదిపేసింది. భూ అంతర్భాగంలో కేవలం 10 నుండి 13 కిలోమీటర్ల లోతులోనే ఈ ప్రకంపనలు కేంద్రీకృతం కావడం వల్ల నష్టం తీవ్రత ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. శతాబ్ద కాలంలో వెనిజువెలా ఎదుర్కొన్న అత్యంత బలమైన భూకంపాలలో ఇది ఒకటి.
కారకాస్‌లో భీతావహ వాతావరణం
భూమి ఒక్కసారిగా ఊగిపోవడంతో ప్రజలు ప్రాణభయంతో ఇళ్ల నుండి వీధుల్లోకి పరుగులు తీశారు. అనేక భవనాల గోడలు కూలిపోయి లోపల ఉన్న ఫర్నిచర్ రోడ్డుపైకి కనిపించేలా దెబ్బతిన్నాయి. కారకాస్‌లోని ప్రముఖ అల్టామిరా పరిసర ప్రాంతాల్లో, తీర ప్రాంత నగరమైన లా గుఐరాలో బహుళ అంతస్తుల అపార్ట్‌మెంట్లు, గృహాలు కుప్పకూలాయి. ప్రమాద స్థలాల నుండి భారీగా ధూళి మేఘాలు గాల్లోకి లేచాయి. విద్యుత్, ఇంటర్నెట్ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోవడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది.
దేశ అంతర్గత వ్యవహారాల మంత్రి డియోస్డాడో కాబెల్లో ప్రభుత్వ టెలివిజన్ ద్వారా మాట్లాడుతూ.. "అల్టామిరా ప్రాంతంలో భవనాలు, ఇళ్లు కూలిపోయిన అత్యంత ఆందోళనకర పరిస్థితులు ఉన్నాయి. అందుబాటులో ఉన్న అన్ని వనరులతో సహాయక చర్యలు అందిస్తున్నాం" అని తెలిపారు. తదుపరి ప్రకంపనలు వచ్చే ముప్పు ఉన్నందున ప్రజలు ఇళ్లలోకి వెళ్లకుండా బహిరంగ ప్రదేశాల్లోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అంబులెన్సుల రవాణాకు ఆటంకం కలిగించకుండా వాహనదారులు సహకరించాలని కోరారు.
తాత్కాలిక సునామీ హెచ్చరికలు
ఈ భారీ భూకంపాల నేపథ్యంలో అమెరికాకు చెందిన పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం ప్యూర్టో రికో, యూఎస్ అండ్ బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, అలాగే వెనిజులా తీర ప్రాంతాలకు తక్షణ సునామీ అడ్వైజరీ జారీ చేసింది. సముద్ర అలల్లో తీవ్ర మార్పులు, బలమైన పోటు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించినప్పటికీ, సుమారు గంట తర్వాత పరిస్థితి అదుపులోకి రావడంతో ఈ హెచ్చరికలను ఉపసంహరించుకున్నారు.
కరీబియన్, దక్షిణ అమెరికా టెక్టోనిక్ ప్లేట్ల సరిహద్దుల్లో ఉండే వెనిజువెలా తీవ్రమైన భూకంపాల జోన్‌లో ఉంది. 1821 నాటి స్వాతంత్ర్య యుద్ధ విజయానికి గుర్తుగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ సెలవు దినం జరుపుకుంటున్న రోజే ఈ ఘోర విపత్తు సంభవించింది. 1967 నాటి ప్రాణాంతక భూకంపం కంటే కూడా దీని తీవ్రత భయంకరంగా ఉందని అధికారులు తెలిపారు. ప్రస్తుతం శిథిలాల కింద చిక్కుకున్న వారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి.