బాలి ట్రిప్‌లో పాస్‌పోర్ట్ మాయం వెనుక అసలు రహస్యం.. పూణె వ్యాపారి హత్య కేసులో వెలుగులోకి షాకింగ్ నిజాలు!

  • బాలిలో ప్లాన్ చేసిన ప్రీ-వెడ్డింగ్ షూట్‌ను చెడగొట్టేందుకు ముందే ప్లాన్
  • పాస్‌పోర్టును మాయం చేసిన నిందితురాలు సియా గోయల్
  • పెళ్లి కోసం జైపూర్‌లో 17 కోట్ల విలాసవంతమైన ప్యాలెస్ బుకింగ్  
  •  సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్‌ అరెస్ట్
  • ఈ నెల 29 వరకు పోలీస్ కస్టడీ విధిస్తూ పూణె కోర్టు తీర్పు
పూణె రియల్ ఎస్టేట్ వ్యాపారి కుమారుడు కేతన్ విశాల్ అగర్వాల్ (26) హత్య కేసు దర్యాప్తులో రోజుకో షాకింగ్ నిజం వెలుగులోకి వస్తోంది. లోహగఢ్ కోట నుండి లోయలోకి నెట్టి చంపడానికి ముందే.. కేతన్‌ను బాలి ట్రిప్ వెళ్లకుండా ఆపడం కోసం పెద్ద వ్యూహమే జరిగినట్లు పోలీసులు గుర్తించారు. కాబోయే భర్తను అంతమొందించిన కేసులో అరెస్టయిన వధువు సియా గోయల్ (20), ఆమె ప్రియుడు చేతన్ బాబూలాల్ చౌదరి (22)లను వాడ్గావ్ మావల్ కోర్టు మంగళవారం 7 రోజుల పాటు (జూన్ 29 వరకు) పోలీస్ కస్టడీకి అప్పగించింది.

బాలి ట్రిప్ క్యాన్సిల్.. పాస్‌పోర్ట్ మాయం!
పూణె రూరల్ పోలీస్ సూపరింటెండెంట్ సందీప్ సింగ్ గిల్ తెలిపిన వివరాల ప్రకారం.. కేతన్, సియా దంపతులకు జూన్ మొదటి వారంలో బాలిలో భారీగా ప్రీ-వెడ్డింగ్ ఫొటోషూట్ ప్లాన్ చేశారు. ప్రయాణ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాక కేతన్ పాస్‌పోర్ట్ విచిత్రంగా మాయమైంది. దీంతో ఆ ట్రిప్ రద్దయింది. అయితే ఈ అంతర్జాతీయ ప్రయాణాన్ని నివారించడానికి సియానే కావాలని.. వీరు టిఫిన్ కోసం హోటల్ వద్ద ఆగినప్పుడు కేతన్ పాస్‌పోర్ట్‌ను చింపేసి, హోటల్ వాష్ రూమ్ లో పారేసిందని విచారణలో తేలింది.

బాలి ప్లాన్ ఫెయిల్ కావడంతోనే ఈ జంట తమ హత్యాకాండను లోహగఢ్ కోటకు మార్చారు. జూన్ 14న అక్కడ చేసిన మొదటి ప్రయత్నం విఫలం కాగా, జూన్ 18న సియా పుట్టినరోజు వేడుకల నెపంతో కేతన్‌ను తీసుకువెళ్లారు. అక్కడ ఎండ ఎక్కువగా ఉన్నప్పటికీ ముఖానికి ముసుగు (హుడీ) ధరించి వెంబడించిన ప్రియుడు చేతన్ సాయంతో, ఫొటోలకు పోజ్ ఇస్తున్న కేతన్‌ను ఒంటరి ప్రదేశం చూసి 400 అడుగుల లోతు ఉన్న లోయలోకి నెట్టేశారు.

రూ. 17 కోట్ల పెళ్లి ఇష్టం లేకే..
ఏడాది కాలంగా ప్రేమించుకుంటున్న సియా, చేతన్‌లు కేతన్‌ను తమ బంధానికి అడ్డుగా భావించారు. నవంబర్‌లో జరగబోయే వివాహం కోసం కేతన్ కుటుంబం ఏకంగా రూ. 17 కోట్లతో జైపూర్‌లొ ఒక లగ్జరీ ప్యాలెస్ బుకింగ్ కూడా చేసింది. కానీ ఈ పెళ్లి ఇష్టం లేని సియా, ప్రియుడితో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు విచారణలో ఇద్దరు నిందితులు అంగీకరించారు. 

 శవం వద్ద కన్నీరు కార్చని వధువు 
తమ సొంత కూతురిలా చూసుకున్న సియా నయవంచనపై కేతన్ తండ్రి విశాల్ అగర్వాల్  ఆవేదన వ్యక్తం చేశారు. కేతన్ శవాన్ని పోలీసులు తీసుకువచ్చిన సమయంలో సియా ముఖంలో ఎలాంటి బాధ లేదా కన్నీళ్లు కనిపించలేదని, ఆమె ప్రవర్తనే తమకు అనుమానం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. పెళ్లి ఇష్టం లేకపోతే నిశ్చితార్థాన్ని రద్దు చేసుకోవచ్చు కదా, ప్రాణాలు తీయాలా? అని ప్రశ్నించారు. ఈ కుట్రలో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు.

Ketan Vishal Agarwal
Sia Goel
Chetan Babulal Choudhary
Lohagad Fort
Pune Businessman Murder
Bali Trip Passport Mystery

More Telugu News