జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీకి వైసీపీ నేత రాచమల్లు వార్నింగ్

YSRCP leader Rachamallu warns Janasena MLA Pantam Nanaji
  • ఇటీవల జగన్ పై విమర్శలు గుప్పించిన నానాజీ
  • ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ రాచమల్లు వార్నింగ్
  • జగన్ దమ్ము ఏంటో పవన్ ను అడిగి తెలుసుకోవాలని వ్యాఖ్య

వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ ను టార్గెట్ చేస్తూ కాకినాడ రూరల్ జనసేన ఎమ్మెల్యే పంతం నానాజీ చేసిన వ్యాఖ్యలపై వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పంతం నానాజీ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ హెచ్చరించారు.


అధికారంలో ఉన్నామనే అహంకారంతో కూటమి నాయకులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని రాచమల్లు మండిపడ్డారు. "జగన్ దమ్ము, ధైర్యం ఏంటో పంతం నానాజీకి తెలియాలంటే ముందు ఢిల్లీలోని పెద్ద పెద్ద లీడర్లను అడగాలి. ఒంటరిగా పోరాడి, కేంద్రంలో ఉన్న పెద్ద పెద్ద వ్యవస్థలను సైతం ధైర్యంగా ఎదుర్కొన్న చరిత్ర జగన్ ది. అక్కడ కూడా తెలియకపోతే.. స్వయంగా మీ పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను అడిగితే జగన్ దమ్ము ఏంటో చాలా స్పష్టంగా చెబుతారు" అంటూ ఎద్దేవా చేశారు.


కేవలం అధికార బలం చూసుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడటం సరికాదని కూటమి నాయకులకు హితవు పలికారు. రాజకీయంలో విమర్శలు చేసేటప్పుడు కనీస స్థాయి మరిచి మాట్లాడే చౌకబారు సంస్కృతిని మానుకోవాలని స్పష్టం చేశారు. తాము ఇప్పుడు ఎన్నికల్లో ఓడిపోయి ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ఎవరికీ భయపడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.


వైసీపీ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని, అప్పుడు తాము కేవలం ఇలా ప్రెస్ మీట్లు పెట్టి మాటలతో సరిపెట్టబోమని.. ఇప్పుడు అక్రమాలకు, వేధింపులకు పాల్పడుతున్న వారిపై లీగల్ యాక్షన్లు ఉంటాయని తీవ్రస్థాయిలో హెచ్చరించారు.

Go Back to Shorts
Rachamallu Siva Prasada Reddy
Pantam Nanaji
YS Jagan Mohan Reddy
Janasena MLA
YSRCP
Andhra Pradesh Politics

More Telugu News