స్నేహితుడి కోసం ముంబైకి.. ఎమ్మెల్సీ ప్రమాణ స్వీకారంలో క్రికెటర్ తిలక్ వర్మ
- స్నేహితుడి ప్రమాణ స్వీకారం కోసం మహారాష్ట్ర విధాన భవన్‌కు తిలక్ వర్మ
- ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన విక్రమ్ కాకడేకు అభినందనలు
- విక్రమ్ తనకు సోదరుడి లాంటి వాడని చెప్పిన భారత క్రికెటర్
మహారాష్ట్రలో స్థానిక సంస్థల కోటాలో కొత్తగా ఎన్నికైన ఆరుగురు ఎమ్మెల్సీలు మంగళవారం విధాన పరిషత్ ఛైర్మన్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో విక్రమ్ కాకడే ఒకరు. పుణే స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి విక్రమ్ ఎన్నికయ్యారు. మాజీ బీజేపీ ఎంపీ సంజయ్ కాకడే కుమారుడైన విక్రమ్, ఎన్సీపీ నేత పార్థ్ పవార్‌కు అత్యంత సన్నిహితుడిగా పేరుగాంచారు.
ఈ సందర్భంగా తిలక్ వర్మ మీడియాతో మాట్లాడుతూ తన స్నేహితుడిపై ప్రశంసల వర్షం కురిపించాడు. "విక్రమ్ కాకడే నాకు సోదర సమానుడు. అతడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రత్యేకంగా ఇక్కడికి వచ్చాను. నా క్రికెట్ కెరీర్ తరహాలోనే, విక్రమ్ కాకడేకి కూడా ఇది ఒక కొత్త ఇన్నింగ్స్ వంటిది. సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటూ ప్రజలకు చేరువైన అతడు, భవిష్యత్తులో మరింతగా ప్రజాసేవ చేస్తాడని ఆశిస్తున్నాను. కొత్త ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న నా మిత్రుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు" అని తిలక్ వర్మ పేర్కొన్నాడు.