పవన్ వల్ల కులాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయి: వైసీపీ నేత నారాయణస్వామి

  • పవన్ వల్ల కులాల కుంపటి రాజుకుంటోందన్న నారాయణస్వామి
  • ప్రజలను రక్షించాల్సిన పోలీసులు భక్షకులుగా మారారని ఆరోపణ
  • సాయికృష్ణ మృతి కేసును సీబీఐకి అప్పగించాలని డిమాండ్

రాష్ట్రంలో జనసేన అధినేత, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వల్లే కులాల కుంపటి రాజుకుంటోందని వైసీపీ నేత, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి ధ్వజమెత్తారు. పవన్ అనుసరిస్తున్న విధానాల వల్ల సమాజంలో కులాల మధ్య విభేదాలు పెరుగుతున్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, ప్రజలను కాపాడాల్సిన పోలీసులే భక్షకులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.


విజయవాడ కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ మృతి కేసును ప్రస్తావిస్తూ.. ఈ దారుణం వెనుక ఉన్న అసలైన ‘బిగ్ బాస్’ ఎవరో తేలాలని నారాయణస్వామి డిమాండ్ చేశారు. "గతంలో రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సొంత కుమారుడు జగన్ పై సీబీఐ విచారణకు వెనుకాడలేదు. అదే స్ఫూర్తితో ప్రస్తుత కూటమి ప్రభుత్వం కూడా ఈ దళిత యువకుడి కేసును నిష్పక్షపాతంగా సీబీఐకి అప్పగించాలి. అప్పుడే బాధ్యులైన ఎంతటి పెద్దవారికైనా శిక్ష పడుతుంది" అని స్పష్టం చేశారు. గతంలో తమిళనాడులో జరిగిన ఒక లాకప్ డెత్ ఘటనలో తొమ్మిది మంది పోలీసులకు ఉరిశిక్ష పడిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు.


రాష్ట్రంలో ఒక దళిత మహిళ (వంగలపూడి అనిత) హోం మంత్రిగా ఉన్నప్పటికీ, దళిత సామాజికవర్గాలపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. కూటమి నేతలు తక్షణమే దళితులపై దాడులను అరికట్టాలని, లేనిపక్షంలో వైసీపీ ఆధ్వర్యంలో బాధితుల తరఫున పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.


Narayanaswamy
Pawan Kalyan
YSRCP
Andhra Pradesh Politics
Vangalapudi Anitha
Vijayawada Dalit youth death case

More Telugu News