ఆ విషయంలో నారా లోకేశ్‌తో నన్ను పోల్చడం కరెక్టే: రామ్ చరణ్

Ram Charan says comparing him with Nara Lokesh is correct in that matter
  • 'పెద్ది' సక్సెస్.. రిపబ్లిక్ టీవీ డిబేట్‌లో పాల్గొన్న రామ్ చరణ్
  • నారా లోకేశ్‌తో చ‌ర‌ణ్‌ ప్రస్థానాన్ని పోల్చిన యాంకర్
  • లోకేశ్‌ సెల్ఫ్ మేడ్ లీడర్ అనడాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించిన చెర్రీ
  • వారసత్వాన్ని కాకుండా స్వయంకృషిని నమ్ముకున్నారని వెల్లడి
  • విమర్శలను అధిగమించి ఎదిగిన తీరులో త‌మ‌కు సారూప్యతలు ఉన్నాయన్న చ‌ర‌ణ్‌

గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్ తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ సోలో హిట్‌గా నిలిచిన 'పెద్ది' చిత్రం సాధించిన భారీ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తున్న తరుణంలో ఆయన ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ 'రిపబ్లిక్ టీవీ' నిర్వహించిన ఒక ప్రత్యేక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాంకర్ అడిగిన ఒక ఆసక్తికరమైన ప్రశ్నకు చరణ్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో వైరల్‌గా మారింది. ఏపీ మంత్రి నారా లోకేశ్‌తో తనను పోల్చడాన్ని ఆయన మనస్ఫూర్తిగా అంగీకరించారు.

యాంకర్ ప్రశ్న.. చరణ్ స్పందన
ఇంటర్వ్యూలో యాంకర్, రామ్ చరణ్‌ను ఉద్దేశించి ఒక విలక్షణమైన ప్రశ్న సంధించారు. "ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాలుగుసార్లు సీఎంగా పనిచేశారు. అయినా ఆయన కుమారుడు నారా లోకేశ్‌ ఎప్పుడూ ఆ అధికారాన్ని తేలికగా తీసుకోలేదు. కింది స్థాయి నుంచి కష్టపడి పనిచేసి, ఒక సెల్ఫ్-మేడ్ లీడర్‌గా తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. వారసత్వంతో ప్రయాణం మొదలుపెట్టి, స్వయంకృషితో ఎదిగిన మీ ఇద్దరి ప్రస్థానంలో చాలా పోలికలు ఉన్నాయి కదా?" అని ప్రశ్నించారు. దీనికి రామ్ చరణ్ స్పందిస్తూ, 'కచ్చితంగా' అని సమాధానమిచ్చారు. లోకేశ్‌ ఒక సెల్ఫ్-మేడ్ నాయకుడనే అభిప్రాయంతో తాను ఏకీభవిస్తున్నట్లు స్పష్టం చేశారు.

వారసత్వం నుంచి స్వయంకృషి వైపు..
సమాజంలో అత్యంత ప్రభావవంతమైన సినిమా, రాజకీయ రంగాల్లోకి మెగాస్టార్ చిరంజీవి వారసుడిగా రామ్ చరణ్, ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడిగా నారా లోకేశ్‌ అడుగుపెట్టినప్పుడు వారిపై అంచనాలు, ఒత్తిళ్లు తారస్థాయిలో ఉన్నాయి. ప్రారంభంలో ఇద్దరూ విమర్శలను ఎదుర్కొన్నారు. చరణ్ నటనపైనా, లోకేశ్‌ ప్రసంగాలపైనా కొందరు సందేహాలు వ్యక్తం చేశారు. అయితే, ఆ విమర్శలకే కుంగిపోకుండా, పట్టుదలతో వాటిని అధిగమించారు. వారసత్వం కేవలం ఒక ప్రవేశ ద్వారం మాత్రమేనని, నిలదొక్కుకోవాలంటే స్వయంప్రతిభే కీలకమని నిరూపించారు.

తండ్రులకు తగ్గ తనయులుగా..
రామ్ చరణ్ 'చిరంజీవి కొడుకు' అనే నీడ నుంచి బయటకు వచ్చి 'మగధీర', 'రంగస్థలం', 'ఆర్ఆర్ఆర్‌' వంటి చిత్రాలతో తనకంటూ ప్రత్యేకమైన స్టార్‌డమ్‌ను సంపాదించుకుని, నేడు గ్లోబల్ స్టార్‌గా ఎదిగారు. అదేవిధంగా నారా లోకేశ్‌ కూడా తండ్రి వారసత్వానికే పరిమితం కాకుండా మంగళగిరిలో క్షేత్రస్థాయిలో పనిచేయడం, రాష్ట్రవ్యాప్తంగా 'యువగళం' పాదయాత్రతో ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం ద్వారా ప్రజా నాయకుడిగా తనను తాను నిరూపించుకున్నారు. ఆధునిక ఆలోచనలు, టెక్నాలజీని అందిపుచ్చుకోవడం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండటం వంటి లక్షణాలు వీరిద్దరిలోనూ కనిపిస్తాయి. తండ్రులకు తగ్గ తనయులుగా తమ తమ రంగాల్లో రాణిస్తున్న వీరి ప్రస్థానం యువతరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది.
Go Back to Shorts
Ram Charan
Nara Lokesh
Republic TV Interview
Peddi Movie Success
Self Made Leaders
Andhra Pradesh Politics

More Telugu News