అమరావతికి మేము వ్యతిరేకం కాదు: మిథున్ రెడ్డి

Mithun Reddy Says We Are Not Against Amaravati Development
  • అమరావతి పేరుతో జరుగుతున్న అవినీతికి మాత్రమే తాము వ్యతిరేకమన్న మిథున్
  • మదనపల్లె మెడికల్ కాలేజీ నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం అడ్డుకుందని మండిపాటు
  • కూటమి పాలనలో మామిడి రైతులు ఎంతో నష్టపోయారని ఆవేదన

ఏపీలోని కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతల విమర్శలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తాజాగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి మాట్లాడుతూ... అమరావతి డెవలప్‌మెంట్, విద్యా-వైద్య రంగాల్లో కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై విమర్శలు గుప్పించారు. అమరావతి అభివృద్ధికి తమ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కానీ అక్కడ సాగుతున్న అవినీతిని మాత్రమే తాము ప్రశ్నిస్తున్నామని అన్నారు. మదనపల్లెలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


గత జగన్ ప్రభుత్వ హయాంలో మదనపల్లెకు మంజూరైన ప్రభుత్వ మెడికల్ కాలేజ్ నిర్మాణాన్ని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కావాలనే అడ్డుకుందని మిథున్ రెడ్డి ఆరోపించారు. మెడికల్ కాలేజీలు పూర్తయితే పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుందని, కానీ దీనిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక చంద్రబాబు ప్రభుత్వం జగన్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ కాలయాపన చేస్తోందని మండిపడ్డారు. మదనపల్లెను జిల్లాగా ప్రకటించడం తప్ప కూటమి ప్రభుత్వం వచ్చాక ఇక్కడ ఒక్క అడుగు కూడా అభివృద్ధి జరగలేదన్నారు.


డీఎస్సీ పరీక్షలపై ఆయన స్పందిస్తూ... "మెరిట్ లిస్ట్‌లో మొదటి ర్యాంక్ సాధించిన అభ్యర్థిని అన్యాయంగా పక్కన పెట్టడంతోనే ఈ పరీక్షల లీకేజీ వ్యవహారం మొత్తం బయటపడింది. కష్టపడి చదివిన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాల్సింది పోయి, అడ్డదారుల్లో పోస్టులు అమ్ముకోవడం అత్యంత అప్రజాస్వామికం. దీనిపై తక్షణమే పూర్తి స్థాయి స్వతంత్ర విచారణ జరపాలి" అని డిమాండ్ చేశారు.


మదనపల్లె టౌన్ బ్యాంక్‌లో పెద్ద ఎత్తున ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయని, దీనికి సంబంధించిన ఇన్‌సైడ్ సమాచారాన్ని స్వయంగా తెలుగుదేశం పార్టీ నేతలే తనకు అందించారని తెలిపారు. ఈ బ్యాంక్ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరారు. అలాగే కూటమి పాలనలో రాష్ట్రంలోని మామిడి రైతులు దారుణంగా నష్టపోయారని, వారిని ఆదుకోవడంలో సర్కార్ ఫెయిల్ అయిందని విమర్శించారు.

Go Back to Shorts
Mithun Reddy
YSRCP
Amaravati Development
Madanapalle Medical College
DSC Exam Leakage
Chandrababu Naidu

More Telugu News