ఇండియా జెర్సీపై తన పేరు చూసి వైభవ్ సూర్యవంశీ భావోద్వేగం

  • ఐర్లాండ్, ఇంగ్లండ్ టీ20 సిరీస్‌లకు వైభవ్ సూర్యవంశీ ఎంపిక
  • భారత జెర్సీని అందుకుని భావోద్వేగానికి లోనైన స్టార్ బ్యాటర్
  • భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్న వయస్కుడిగా రికార్డ్
  • అతడిని ఎంపిక చేయకుండా ఉండలేకపోయామన్న చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్
  • జూన్ 26 నుంచి ఐర్లాండ్‌తో టీ20 సిరీస్
భారత క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా ఎదిగిన 15 ఏళ్ల యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీ జీవితంలో ఒక అపురూపమైన మైలురాయి ఆవిష్కృతమైంది. ఐర్లాండ్, ఇంగ్లండ్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం భారత సీనియర్ జట్టుకు తొలిసారి ఎంపికైన వైభవ్.. తాజాగా తన పేరు ముద్రించి ఉన్న అధికారిక బ్లూ జెర్సీని అందుకున్నాడు. జెర్సీపై తన పేరును చూసుకున్న వైభవ్ మాటలు రాక, తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు.  

ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరఫున వైభవ్ సూర్యవంశీ సృష్టించిన పరుగుల విధ్వంసమే అతడికి ఈ చారిత్రాత్మక అవకాశాన్ని తెచ్చిపెట్టింది. టోర్నమెంట్‌లో ఎవరూ ఊహించని విధంగా 237కు పైగా స్ట్రైక్ రేట్‌తో ఏకంగా 776 పరుగులు సాధించి ఆరెంజ్ క్యాప్‌తో పాటు పలు వ్యక్తిగత అవార్డులను కైవసం చేసుకున్నాడు. 

ఈ అసాధారణ ప్రదర్శనతో భారత సీనియర్ జట్టుకు పిలుపు అందుకున్న అత్యంత పిన్న వయస్కుడిగా వైభవ్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. తద్వారా క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ పేరిట దశాబ్దాలుగా ఉన్న రికార్డును ఈ లెఫ్ట్ హ్యాండ్ ఓపెనర్ బద్దలు కొట్టాడు. జూన్ 26 నుంచి ఐర్లాండ్‌లో ప్రారంభం కానున్న టీ20 మ్యాచ్ ద్వారా వైభవ్ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయనున్నాడు. 

వైభవ్ ఎంపికపై టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ స్పందిస్తూ.. ఐపీఎల్‌ అద్భుతంగా ఆడిన వైభవ్.. ఇండియా-ఏ జట్టు ఆడిన ముక్కోణపు సిరీస్‌ ఫైనల్‌లొ 94  పరుగులో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడని గుర్తుచేశాడు. ఈ ప్రదర్శనతో వైభవ్‌ను పక్కన పెట్టే ఆప్షన్ సెలెక్షన్ కమిటీకి లేకుండా పోయిందన్నాడు. తన ఆటతీరుతో తనకు తానుగా జట్టులో స్థానాన్ని సంపాదించుకున్నాడని ప్రశంసించాడు. వైభవ్ సాధించిన ఈ ఘనతతో బీహార్‌లోని అతడి సొంత ఊరు సమస్తిపూర్‌లో పండుగ వాతావరణం నెలకొంది. స్థానికులు బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు.  

Vaibhav Suryavanshi
Indian Cricket Team
IPL 2026 Rajasthan Royals
Sachin Tendulkar Record
India vs Ireland T20
Ajit Agarkar

More Telugu News